Gudivada Amarnath On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో మంగళవారం జరిగిన వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిజ్ఞానం లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తానని ఒకసారి, చీలనివ్వనని మరొకసారి చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన రాజకీయంగా ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పవన్ సభకు వచ్చే వారంతా పవన్ ని పదేపదే సీఎం.. సీఎం అంటుంటారని ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి, సీఎం పవన్ కల్యాణ్ అనే పేరుతో సినిమా తీస్తే.. దానికి తాను ప్రొడక్షన్ చేస్తానని మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. అనకాపల్లిలో ఏ పార్టీతో కలవకుండా జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయగలదా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణ్ అని ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీలు చెప్పగలవా? అని ఆయన ప్రశ్నించారు.
కబ్జా అంటే అర్థం కూడా తెలియదు
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షుగర్ ఫ్యాక్టరీలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని పూర్తిగా నాశనం చేశారని అమర్నాథ్ విమర్శించారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ నడవాలంటే రెండున్నర లక్షల టన్నుల చెరుకు అవసరం అవుతుందని, అంత చెరుకు అందుబాటులో లేనందున, ఈ ఫ్యాక్టరీని చెరుకు సంబంధిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా మార్చాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారని అమర్నాథ్ తెలియజేశారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ భూములను తాను కబ్జా చేస్తున్నానని విపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను అమర్నాథ్ తిప్పి కొట్టారు. భూములను కబ్జా చేసే నైజం తనది కాదని, తనకు కబ్జా అంటే అర్థం తెలియదని, వేరెవరైనా సెంటీమీటర్ భూమి కూడా కబ్జా చేసే అవకాశం లేకుండా చూస్తానని అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో గెలిచిన తాను ఈ మూడున్నర సంవత్సరాలలో ఎటువంటి అవినీతి పనైనా చేశానా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తనకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని అమర్నాథ్ చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులపై కూడా విమర్శలు చేయడం తగదని అమర్నాథ్ చెప్పారు.
చంద్రబాబుకు ఆఖరి ఎన్నికలు
చంద్రబాబు హయాంలో ప్రజలకు పనికొచ్చే ఏ పనైనా చేశారా? మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో అప్పజెప్పాడని మంత్రి అమర్నాథ్ చెబుతూ ఆయన హయాంలో 85 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తానని, 17 వేల కోట్ల రూపాయలు డ్వాక్రాలను మాఫీ చేస్తానని మోసగించాjని ఆయన అన్నారు. ఈ డబ్బులన్నీ ఎగ్గొట్టి, ఎన్నికల్లో పసుపు, కుంకుమ కింద పంచిపెట్టి ఓట్లు దండుకోవాలని చూశారని ఆరోపించారు. కానీ ప్రజలు బాబు కళ్లల్లో ఉప్పు, కారం కొట్టారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన తన పదవి కాలంలో మహాప్రస్థానం వాహనాన్ని మాత్రమే ప్రవేశపెట్టారని, వచ్చే ఎన్నికలు తనకి ఆఖరి ఎన్నికలను అని చెప్పుకొని ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటున్నారన్నారు.
64 లక్షల మందికి పింఛన్లు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్లాదిమంది ప్రజానీకానికి ఎలా మేలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారని మంత్రి అమర్నాథ్ అన్నారు. కొత్తగా రెండున్నర లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, అలాగే ప్రస్తుత పింఛను దారులకు అదనంగా మరో 250 రూపాయలు కలిపి ఇస్తున్నామని అమర్నాథ్ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వటమే కాకుండా, వృద్ధులకు అండగా నిలబడాలని జగన్ భావిస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లు పొందుతున్న వారిలో ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో మరొకరికి పెన్షన్ ఇచ్చేవారు తప్ప కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవని అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబుకు ఇచ్చే గుణం లేదని, పేదలకు సహాయం చేసే నైజం కూడా లేదని ఆయన అన్నారు. చంద్రబాబు తన పదవీకాలంలో పెన్షన్ల కోసం 400 కోట్ల రూపాయలకు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ మూడేళ్లలో 1750 కోట్ల రూపాయలకు ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. కోటి రూపాయలతో బొజ్జన్న కొండకు రహదారి నిర్మాణం చేపడుతున్నామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఈ ప్రాంతంలో కల్యాణ మండపాల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు.