KA Paul : టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకడితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే హక్కులేదన్నారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ అమ్ముడుపోయారని ఆరోపించారు. జగన్‌తో సహా ఎవరూ ఏపీని అభివృద్ధి చేయలేదని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే లక్ష కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తా అంటూ కేఏ పాల్ పేర్కొన్నారు. రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధాన్ని విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై కేఏ పాల్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సభలపై డీజీపీకి ఫిర్యాదు చేశాని, ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్లానన్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందన్నారు. చంద్రబాబు కన్నా వైఎస్ జగన్ వేయి రెట్లు బెటర్ అని కేఏ పాల్ స్పష్టం చేశారు. తాను చెప్పిన సలహాలు వైఎస్ జగన్ కొన్ని పాటించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ తనను పిలిపించి మాట్లాడతారేమో చూస్తానన్నారు.
పవన్ చంద్రబాబుకు దూరంగా ఉండాలి
చంద్రబాబు తనను కూడా మోసం చేశారని కేఏ పాల్ విమర్శించారు. కేసీఆర్ ఏపీకి వస్తే చెప్పుతో కొడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రావెల కిశోర్ బాబు ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు. రావెల కిషోర్ గతంలో పాస్టర్ అని, మతం మార్చుకున్నానని మోసం చేసి బీజేపీలో చేరారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు దూరంగా ఉండాలని కేఏ పాల్ సలహా ఇచ్చారు. వర్ల రామయ్య మంచోడో కానీ టీడీపీ అడుక్కు తింటున్నారని తీవ్రంగా విమర్శించారు. వర్ల రామయ్య పోటీ చేసి ఓడిపోతే వంద కోట్ల ఇస్తానని కేఏ పాల్ ప్రకటించారు. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిచ్చి పనుల కోసం దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. కాపులకు రాజ్యాధికారం కావాలా? రిజర్వేషన్లు కావాలా? అని కేఏ పాల్ ఎద్దేవా చేశారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి తన సలహాలు తీసుకుంటున్నారని కేఏ పాల్ అన్నారు. దేశానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కేంద్రానికి సహకరించానన్నారు. ప్రధాని కన్నా జగన్ గొప్పవారా? అంటూ నిలదీశారు. సీఎం జగన్ తనను పిలిచి సలహాలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు చనిపోవడానికి చంద్రబాబే కారణం అన్నారు. చంద్రబాబు శవ రాజకీయం చేశారని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరులో అంత ప్రమాదం జరిగాక చంద్రబాబు కావలిలో మళ్లీ సభ పెట్టారని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ పై రోజా ఫైర్
చంద్రబాబు, లోకేశ్, పవన్ లకు అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తున్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో ప్రతిపక్షాలు పనికి మాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడడం ప్రజలంతా చూస్తున్నారన్నారు. వేంకటేశ్వర స్వామిని ప్రతిపక్షాలకు గట్టిగా బుద్ది చెప్పాలని కోరుకున్నట్లు తెలిపారు. 2022లో ప్రతిపక్షాలు నీతిమాలిన రాజకీయం చేశాయన్న మంత్రి రోజా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాకుండా, ప్రజలు సంతోషంగా ఉండే సమయంలో వచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారని విమర్శలు గుప్పించారు. పేదరికంలో ఉన్న ప్రజలకు ఆశ చూపి ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు, కాళ్లు, చేతులు విరిచేలా హేయమైన చర్యలు చేస్తున్నారన్నారు.
పవన్ ఎందుకు నోరు మెదపడంలేదు
ప్రజల జీవితాలతో నిజంగా చెలగాటం ఆడిన వారికి దేవుడు బుద్ధి చెప్పాలని కోరుకున్నానని మంత్రి రోజా అన్నారు. కందుకూరిలో అన్యాయంగా ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను తీశారని, బుద్ధి లేకుండా మళ్లీ గుంటూరులో పేదలకు ఆశ చూపి ముగ్గురు ప్రాణాలు పోగొట్టాడని చంద్రబాబు కారణం అయ్యారన్నారు. కనీసం క్షతగాత్రులను పరామర్శించకుండా మానవత్వం లేకుండా హైదరాబాద్ కు వెళ్లి ఎంజాయ్ చేశారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ప్రజల కోసం పార్టీ పెట్టానని చెప్తారు కానీ, చంద్రబాబు సభలో మొన్న ఎనిమిది మంది, నిన్న ముగ్గురు చనిపోయిన, చాలా మంది ప్రజలు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుంటే పవన్ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటంలో అన్యాయంగా, అక్రమంగా నిర్మించిన గోడలు కొడితే మాత్రం ఏదో తప్పు అయినట్లు డబ్బులు ఇచ్చారని, చంద్రబాబు సభలో ప్రాణాలు పోగొట్టున్న వారికి పవన్ ఎందుకు డబ్బులు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కానీ, పవన్ కానీ, లోకేశ్ కానీ అధికారమే పరమావధిగట ఉన్నారే తప్పా వీరికి ప్రజలపై ప్రేమ లేదని పేర్కొన్నారు.