ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘లవ్ టుడే’. ఈ చిత్రంలో ఇవన, యోగిబాబు, సత్యరాజ్‌, రాధిక కీ రోల్స్ పోషించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది.


ఆ వార్తలన్నీ అవాస్తవాలే- బోనీ కపూర్


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వినిపించాయి. ఈ సూపర్ హిట్ మూవీని నిర్మాత బోనీ కపూర్ త్వరలో హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను బోనీ కపూర్ తీసుకున్నట్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయానికి సంబంధించి బోనీ కపూర్ స్పందించారు. ‘లవ్ టుడే’ సినిమాకు సంబంధించి తాను ఎలాంటి రీమేక్ రైట్స్ తీసుకోలేదని వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు. ఈ వివరణతో గత కొంత కాలంగా ‘లవ్ టుడే’ హిందీ రీమేక్ పై వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.






ఓటీటీలో ‘లవ్ టుడే’ స్ట్రీమింగ్  


ప్రస్తుతం ‘లవ్ టుడే’ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా కథ ఏంటంటే.. ఐటీ ఎంప్లాయీస్ అయిన ప్రదీప్ (ప్రదీప్ రంగ‌నాథ‌న్‌), నిఖిత (ఇవానా) లవ్ లో పడతారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. ఈ విషయం నిఖిత ఇంట్లో తెలుస్తోంది. ఆమె తండ్రి శాస్త్రి (స‌త్యరాజ్‌) ప్రదీప్ ను ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు. ఇద్దరి ప్రేమకు ఓకే చెప్తాడు. కానీ, ఇద్దరి ఫోన్లు ఒక రోజంతా ఒకరికొకరు మార్చుకోవాలని కండీషన్ పెడతాడు. ఆ తర్వాత ఒకరి ఫోన్ మరొకరు చూసి ఎలా రియాక్ట్ అవుతారు? ఎలాంటి పర్యవసానాలు ఏర్పడుతాయి? చివరకు వాళ్ల పెళ్లి అవుతుందా? లేదా? అనేది సినిమాలో చూపించారు.  


అటు బోనీ కపూర్ ప్రస్తుతం హిందీతో పాటు సౌత్ సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నారు. తాజాగా ఆయన తమిళ స్టార్ హీరో అజిత్‌తో ‘తునివు’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా, సినీ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై ఈ ట్రైలర్ అంచనాలను పెంచేసింది.






Read Also: హాలీవుడ్ నటుడు, మార్వెల్ హీరో జెరెమీ రెన్నెర్‌కు ప్రమాదం, పరిస్థితి విషమం?