అవెంజర్స్ మూవీ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు జెరెమీ రెన్నెర్ ప్రమాదానికి గురయ్యారు. మంచు చరియలు విరిగిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి బయట మంచును తొలగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. 


క్రిటికల్‌గా ఉన్నా.. ప్రాణాపాయం లేదన్న డాక్టర్లు


జెరెమీ రెన్నర్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటికీ ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నా, ప్రాణాలకు ఇబ్బంది లేదని చెప్పారు. తొలుత ఆయన పరిస్థితి గురించి ఏం చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. అయినా, ఆ తర్వాత మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటున్నట్లు వివరించారు. డాక్టర్ల తాజా ప్రకటనతో ఆయన అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. 


ఏం జరిగింది?


జెరెమీ రెన్నర్ అమెరికాలోని మౌంట్ రోజ్ స్కీ తాహో ప్రక్కనే ఆయన ఇల్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అధిక మొత్తంలో మంచు కురుస్తోంది. మంచు ధాటికి ఆ ప్రాంతంలో రవాణా, విద్యుత్ వ్యవస్థలు స్తంభించాయి. రెండు రోజులుగా అక్కడి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. జెరెమీ రెన్నర్.. ఇంటి పైకప్పుపై గడ్డ కట్టుకుపోయిన మంచును తొలగించేందుకు ప్రయత్నించాడు. అయితే మంచు పెద్ద ఎత్తున విరిగి ఆయనపై మీద పడింది. బరువైన గడ్డకట్టిన మంచు అతనిపై పడటం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని హెలీకాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.  






ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు


జెరెమీ రెన్నర్‌కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అవెంజర్స్ సిరీస్‌ లో హాక్‌ ఐ(Hawkeye) క్యారెక్టర్‌తో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్ లోనూ ఆయన అభిమానులకు కొదువలేదు. గత ఏడాది మేలో ఆయన ఇండియాకు వచ్చారు. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ – ఘోస్ట్‌ ప్రోటోకాల్‌’లో అనిల్‌ కపూర్‌ తో కలిసి జెరెమీ రెన్నర్‌ నటించారు. దీని ప్రమోషన్ కోసం ఆయన ఇండియాకు కూడా వచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 


Read Also: రష్యాలో తగ్గేదే లేదంటున్న ‘పుష్ప’, ఆల్ టైమ్ ఫేవరెట్ ఇండియన్ మూవీగా గుర్తింపు