Amrit Bharat Station Scheme: రద్దీ ఎక్కువగా కల్గిన రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ అనే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద ఏపీలో తొలి విడతలో 11 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఈక్రమంలోనే వీటి అభివృద్ధికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ పథకం కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో భారీ మార్పులు చేసి వాటి రూపురేఖలు మార్చబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో తొలి విడత కింద ఎంపికైనా రైల్వే స్టేషన్లలో అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపురం, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని ఉన్నట్లు తెలిపారు. 






అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా మొత్తం 1275 స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. వీటిలో ఏపీ నుంచి 72 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. అిృయితే ఆయా రైల్వే స్టేషన్లలో రాకపోకలు మరింత సులువుగా మారేలా, కొత్త అనుభూతిని పంచేలా సౌకర్యాలను మెరగు పరచనున్నట్లు తెలిపారు. విశాలమైన ప్లాట్ ఫాంలతో పాటు 12 మీటర్ల వెడల్పుతో పుట్ ఓవర్ వంతెనలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైల్వే స్టేషన్ల అభవృద్ధికి సంబంధించి ప్రజల్ని కూడా భాగస్వాముల్ని చేయనున్నట్లు పాటిల్ తెలిపారు. రైల్వే స్టేషన్ల అప్ గ్రేడేషన్ పై ప్రజల నుంచి సూచనలు కోరారు. ప్రజలు తమ సూచనలను ఆగస్టు 3లోగా ఈ మెయిల్, ట్విట్టర్ ద్వారా పంపవచ్చని అన్నారు. అలాగే స్టేషన్ల వారీగా ఈ మెయిల్ అడ్రస్ లు, హ్యాష్ ట్యాగ్ లు జత చేశారు.