ఏపీలో మూడేళ్ల పాలనను అధికార పార్టీ ఇంటింటికీ చేరవేసే కార్యక్రమాన్ని నేటి (మే 11) నుంచి ప్రారంభించనున్నారు. సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చిన ప్రయోజనంతో పాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ప్రజలకు వివరించనున్నారు. ఇలా గడపగడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన పనులను వివరించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 


గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ప్రతి ఇంటి గడపకూ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లు వెళ్లనున్నారు. ఆ ఇంట్లోని వాళ్లకు తాము మూడేళ్లలో అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు వివరించనున్నారు. భవిష్యత్తులోనూ తమకు తోడుగా ఉండాలని కోరనున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లు తమను ఆశీర్వదించాల అడగనున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 80 వరకూ సచివాలయాలు ఉంటాయి. నెలలో 20 రోజులు గడప గడపకూ వైఎస్సార్‌ సీపీ కార్యక్రమం సాగనుంది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి 8 నుంచి 9 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.


గత నెల 27న నిర్వహించిన సమావేశంలో గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం గురించి చర్చ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలని సీఎం జగన్ సూచించారు. బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను జిల్లా అధ్యక్షులు, మంత్రులు, రీజినల్ కో ఆర్డినేటర్లు సమన్వయం చేయనున్నారు. రోజూ ఈ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల కో ఆర్డినేటర్, వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డికి సీఎం జగన్ అప్పగించారు.


ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును తాను కూడా క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతానని సీఎం గతంలోనే తెలిపారు. సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమం ముగిసేలోపే బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలే ఉంటారు. మొత్తానికి పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్‌ లక్ష్యంగా ఉంది.


గడప గడపకు వైఎస్ఆర్ టీమ్‌లో పాల్గొనేది వీరే
* నియోజకవర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలను మండల, మున్సిపాలిటీలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు షెడ్యూల్‌ను రూపొందించాలి. 
* గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంచాలి. 
* గడప గడపకు వెళ్లినప్పుడు లబ్ధిదారుల సంతృప్త స్థాయిని తెలుసుకుంటారు. నెలలో 10 గ్రామ, వార్డు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించేలా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి.