తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడింది 'అసని'. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కిలోమీటర్ల దూరంలో కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 


కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే ఛాన్స్. 


ఈరోజు ఉమ్మడి కోస్తాంధ్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడ వచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో  ఈదురగాలులు వీస్తాయని చెబుతోంది. 







కోనసీమ కలెక్టర్ ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. కంట్రోల్‌ రూమ్‌లో సిబ్బంది 24 గంటల పాటు విధుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగులకు ప్రస్తుతానికి సెలవులు రద్దు చేశారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా. 


తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు 
అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రవేపు వెళ్లొద్దని సూచిస్తున్నారు. 
విశాఖపై అప్పుడే తుపాను ప్రభావం గట్టిగా పడింది. నగరంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అర్థరాత్రి నుంచి వర్షాలు జోరు అందుకుంది. పాతభవనాల్లో ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టుప్రాంతాల్లో ఉన్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హితవు పలికారు. 


కోస్తా తీరంతోపాటు అటు రాయలసీమలో కూడా జోరు వానలు పడే ఛాన్స్ ఉంది. నిజాంపట్నం హార్బర్‌లో 8వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు అధికారులు. ఇప్పటి రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. 


తుపాన్‌ కారణంగా సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటన రద్దు చేసుకున్నారు. నేడు పశ్చిమ గోదావరి, రేపు అరకు వెళ్లాల్సి ఉన్న సీఎం జగన్.. తన పర్యటనలు రద్దు చేసుకున్నారు. 


తుపాను దృష్ట్యా 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 


రద్దు చేసిన రైళ్లు ఇవే
విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ ప్యాసింజర్‌
విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ రైలు
నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్ రైలు
భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ రైలు
విజయవాడ-భీమవరం జంక్షన్ రైలు