బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని ఉప్పలవారిపాలెంలో జరిగిన ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. తన సోదరికి రక్షణగా వెళ్లిన ఓ పదోతరగతి విద్యార్థిని రాజోలులో కొందరు యువకులు హతమార్చారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థి అమర్‌నాథ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది తీవ్ర దుమారం రేపుతోంది. 


ఈ దుర్గటనలో మృతి చెందిన అమర్‌నాథ్ కుటుంబాన్ని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరామర్శించడం ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఎంపీ మోపిదేవికి నిరసన సెగ తగిలింది. తమ ఊరిలోకి రావద్దంటూ ప్రజలు, బాలుడి బంధువులు నినాదాలు చేశారు. ఎంపీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. ఇంత ఘోరం జరిగి 24 గంటలు అయినా ఎవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


బాధితులను పరామర్శకు వచ్చామని చెప్పిన ఎంపీ  వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. అమర్‌నాథ్‌ తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు తాను వ్యక్తిగతంగా కుటుంబానికి లక్ష సాయం చేస్తామన్నారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే తిరిగి డబ్బులు ఇస్తామంటూ మండిపడ్డారు. దీనిపై స్థానిక వైసీపీ లీడర్లు వారికి సర్ది చెప్పేందుకు యత్నించినా వారు వినిపించుకోలేదు. ఎంపీ చేసేది లేక అక్కడి  నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. 


ఈ కేసును వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని అన్నారు మోపిదేవి. దోషుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అమర్నాథ్‌ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రస్తుతం సాయం కింద 50 వేలు అందజేశారు. ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. అంగన్‌వాడీ పోస్టు కానీ మరే ఇతర పోస్టైనా ఇస్తామన్నారు.


బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలానికి చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ ఉదయం రాజోలులో ట్యూషన్ కు వెళ్తున్నాడు. రోజూలాగే శుక్రవారం రోజు ఉదయం కూడా ట్యూషన్ కు వెళ్తుండగా.. మార్గం మధ్యలో రెడ్లపాలెం వద్ద గుర్తు తెలియని దుండగులు బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకోవడంతో అమర్నాథ్ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. అది విని విషయం గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కానీ ఆలోపే అమర్నాథ్ మృతి చెందాడు. అయితే విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


తమ కుమారుడి మృతికి కారణం అయిన వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే అమర్నాథ్ చనిపోయేకంటే ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో తన స్నేహితులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా తోటి విద్యార్థి వెంకటేశ్వర్ రెడ్డి, మరికొందరు స్నేహితులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు అమర్నాథ్ వివరించాడని.. ఈక్రమంలోనే పోలీసుల వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.