ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో ప్ర‌స్తుత‌, మాజీ ఆర్ధిక మంత్రులు ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ఎవ‌రి ప్ర‌భుత్వ హ‌యాంలో ఆదాయం బాగుందో తేల్చుకునేందుకు చ‌ర్చ‌కు సిద్ద‌మంటున్నారు ఇద్ద‌రు నేత‌లు.


ఆర్థిక పరిస్థితిపై రచ్చ...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు(Chandra Babu) వ‌చ్చినా య‌న‌మ‌ల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) వ‌చ్చినా చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) ప్ర‌క‌టించారు. సీఎం జగన్(jagan) వ‌స్తే తామెప్పుడూ చ‌ర్చ‌కు సిద్ద‌మే అంటున్నారు మాజీ మంత్రి య‌న‌మ‌ల‌ రామకృష్ణుడు. ఆంధ్రప్రదేశ్ ఖ‌జానా ప‌రిస్థితిపై రాజ‌కీయంగా దుమారం రేగుతుంది. రాష్ట్రం అప్పులు పాల‌యిపోయిందంటూ తెలుగు దేశం పార్టీ చేస్తున్న ప్ర‌చారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్‌గానే స్పందిస్తుంది. 


బుగ్గన వాదన ఇది...
కావాల‌నే ప్ర‌భుత్వంపై  దుష్ఫ్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు ఆర్థిక‌మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ రెడ్డి. తాము ప‌థ‌కాలు ఇస్తుంటే ఉచితాలంటున్నారని, అలాంటిది తెలుగుదేశం వాళ్లు తమకంటే ఎక్కువ ఇస్తామంటున్నార‌ని ఎద్దేవా చేశారు మంత్రి రాజేంద్ర‌నాథ్‌ రెడ్డి . ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో 28,103 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు బుగ్గ‌న‌. సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీ 4 శాతం మేర పన్ను వసూళ్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యాపారాలు బాగోలేకుంటే పన్నుల వసూళ్లు ఎలా పెరుగుతాయని ప్ర‌శ్నించారు. రాష్ట్రం ఆదాయం, వనరుల పెరుగుదలతో తెలుగుదేశం హయాంలో బాగుందో .. ఇప్పుడు బాగుందో చర్చకు సిద్దంగా ఉన్నామ‌న్నారు. చంద్రబాబు వచ్చినా, యనమల వచ్చినా తాను చ‌ర్చ‌కు రెడీగా ఉన్నాన‌న్నారు మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ రెడ్డి.


యనమల కౌంటర్..
బుగ్గ‌న రాజేంద్రనాథ్‌ రెడ్డి స‌వాల్‌కు మాజీ మంత్రి య‌న‌మ‌ల కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై ముఖ్యమంత్రి జగన్ బహిరంగ చర్చకు వస్తే.. మేం సిద్ధమని గతంలోనే చెప్పామ‌న్నారు. దమ్ముంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై చర్చకు రావాలన్నారు. ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అడ్డగోలుగా అబద్దాలు చెప్పి వెళ్లిపోవడం కాదని, రాష్ట్రం భారీగా అప్పులు చేసింద‌ని అన్నారు. తెలుగు దేశం హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల రాకతో ఆదాయం సమకూరిందని, ప్రస్తుతం అప్పులపైనే ఆధారపడిన పరిస్థితి ఉంద‌న్నారు. నాడు విభజన సమస్యలు వెంటాడుతున్నప్పటికీ ఐదేళ్లలో 1.86 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేయ‌గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్ల‌లో చేసిన అప్పు ఏడు లక్షల కోట్లు అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని ఆరోపించారు య‌న‌మ‌ల‌. గతంలోనే తాము వాస్తవ పరిస్దితులపై అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా, రాజకీయ కోణంలో మాత్రమే అధికార వైఎస్ఆర్‌కాంగ్రెస్ ప్రభుత్వం కామెంట్స్ చేసి, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడిందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ఆర్దిక పరిస్థితులపై వాస్తవాలను ప్రభుత్వం వెల్లడించటం లేదని, ప్రభుత్వ పథకాలు అమలు చేసే ఉద్దేశంతో ఉన్నప్పటికి అందుకు అవసరం అయిన వనరులను కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని యనమల అంటున్నారు.