Pawan Kalyan on YCP Leaders :

  ఒక్కో వైసీపీ గూండాను చొక్కా బట్టలిప్పి రోడ్ల మీద కొట్టిస్తాను.. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెబుతున్నాను.. అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. క్రిమినల్స్ అంటే తనకు చిరాకు అని, నేర చరిత్ర ఉన్న ఈ సన్యాసులు, గూండాగాళ్లు, రౌడులు మనల్ని పాలిస్తారా, ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్లతో పాలించుకోవటానికి సిగ్గుండాలంటూ వైసీపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఓటర్లకు పవన్ కళ్యాణ్ చురకలంటించారు. సినిమాలు వేరు, రియల్ లైఫ్ వేరు అన్నారు. పిఠాపురంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
సీఎం జగన్ కు నేనంటే భయం..
ఏమైనా మాట్లాడితే నేను బటన్ నొక్కాను, డబ్బులిచ్చాను అని పదే పదే చెబుతారు సీఎం జగన్. తానంటే సీఎంకు చాలా భయం అని, జనసేన అంటే ఇంకా భయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీర మహిళలు అంటే భయం, జన సైనికులు అంటే కూడా భయం అంటూ సెటైర్లు వేశారు. తుని వద్ద ఎవరో మంత్రి ఉన్నారు, ఆయన అనుచరుడు ఎవరో కబ్జా చేశారని ప్రశ్నించినందుకు, అమ్మాయికి మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పి హాస్పిటల్ లో పెట్టారు. జన సైనికులు, వీర మహిళలు ఆ అమ్మాయి తల్లికి మద్దతుగా నిలిచారని చెప్పారు. వైజాగ్ లో దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవని కరోనా సమయంలో ప్రభుత్వాన్ని అడిగారు. దాంతో ఆయనను మానసికంగా హింసించి, వేధించి పిచ్చివాడ్ని చేసి చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఐదు మంది గూండాలు కంట్రోల్ చేస్తారు..
మనం ఇక్కడ వేల మంది ఉన్నాం. కానీ ఐకమత్యంగా ఉండకపోతే, సమష్టిగా పోరాడకపోతే, ధైర్యంగా లేకపోతే మనల్ని ఐదు మంది గూండాలు కంట్రోల్ చేయగలరు. కనుక ప్రతి ఒక్కరు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే అదే గూండాలను మనం మట్టిలో తొక్కేయవచ్చూ అన్నారు. అయితే తాను ఎవర్నీ రెచ్చగొట్టడం లేదని, సమష్టిగా పోరాడితే కలిగే ప్రయతోజనాన్ని ప్రస్తావించారు. కులాలు, మతాలు అని విడిపోతే నష్టపోయేది మనమే అంటూ వారిని చైతన్య పరిచే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. 


పిచ్చి వాగుడు వాగితే దాడులు తప్పవు అంటూ మెచ్చరించారు. ట్యాక్స్ కట్టేవాళ్లను, అమాయకులను, మంచి వాళ్లను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం బాధ్యతల్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాని, తనకు ఏం భయం లేదని, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తినైనా ఎదిరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకుల చిట్టా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద ఉందని, అందుకే వైజాగ్ కు వచ్చినప్పుడు అవినీతిపై ప్రశ్నించారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో గూండాలు అధికార పార్టీ ఎంపీ ఇంటికి వచ్చి వాళ్ల కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. కానీ డీజీపీ మాత్రం ఛేజ్ చేసి పట్టుకున్నామని చెబుతున్నారు. ఐపీఎస్ అయి ఉండి ఇలాంటి అబద్దాలు చెప్పడం అవసరం లేదన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రంలో సంపద క్రియేట్ చేయకుండా, కేవలం అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు వేశామని చెప్పుకోవడానికి సిగ్గులేదా అంటూ పవన్ ఫైర్ అయ్యారు.