అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళితే తన రెండు చెప్పులు కొట్టేశారని, చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదని, కుర్తా వేసుకుంటే బాగుంటుందని షూస్ వేసుకుని వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో అన్నవరం గుడిలో తన చెప్పుల చోరీ గురించి చెబుతూ పరోక్షంగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి జనసేనాని పవన్ కౌంటరిచ్చారు. తాను తెల్ల దుస్తుల్లో కాకుండా ఇలా వేరే కలర్ డ్రెస్సులో ఎందుకు వచ్చానో మీకు డౌట్ రాలేదా అన్నారు. తనకు ఇష్టమైన రెండు చొప్పులు ఎవరో దొంగిలించారని, మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్ అని పవన్ అనేసరికి అక్కడ అరుపులు, కేకలతో దద్దరిల్లింది. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోయిందని, ఇంతకు దిగజారిందని వ్యాఖ్యానించారు. 






పవన్ చెప్పులు చూపించి మక్కెలిరగ్గొడతానని అంటున్నారని, ఆయన వద్దే చెప్పులున్నాయా.. అంటూ తాను చెప్పులు చూపిస్తున్నాను, మక్కెలిరిగిపోతాయని మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు పవన్ కౌంటరిస్తూ.. అన్నవరం గుడిలో తన చెప్పులు ఎత్తుకెళ్లారని, వైసీపీ ప్రభుత్వం తన చెప్పులు చోరీ చేసే స్థితికి దిగజారింది అంటూ పేర్ని నానికి తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వైసీపీ ప్రభుత్వం గూండాలకు నిలయం అని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్కో వైసీపీ గూండాను బట్టలు విప్పి కొడతామని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఆడబిడ్డ ఏడుపే జనవాణికి కారణం..
తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ఇంటికి సమీపంలో గ్రామ సచివాలయం ఉద్యోగి కోసం తమ ఇంటిని తొలగించారని న్యాయం చేయాలంటూ ఓ ఆడబిడ్డ తనను కోరిందన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తరువాత అమ్మాయిని గుర్తించి ఆమె చేతిలో ఉన్న పేపర్లు తీసుకుని చూశాను. మీ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశానని తెలిసి, వైసీపీ ప్రభుత్వం వాళ్ల కుటుంబంపై కక్ష గట్టిందన్నారు. వాళ్ల అన్న మార్కెట్ కు వెళ్లి రాలేదని, మరుసటి రోజు రాలేదని.. మూడో రోజు ఫోన్ చేసి ఒంగోలులో ఉన్నానని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ చివరికి అతడి శవాన్ని ఆటోలో తీసుకొచ్చి వాళ్ల ఇంటివద్ద వదిలివెళ్లినా ప్రశ్నించే పరిస్థితి కనిపించడం లేదని మండిపడ్డారు.


గొల్లప్రోలులో ఓ ఆడబిడ్డ అన్నది. ఇంటినుంచి ఆడబిడ్డను బయటకు పంపాలంటే భయం వేస్తోందన్న అని చెప్పింది. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తే ఆడబిడ్డల్ని బతకనివ్వరు అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీళ్లు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎంపీని సైతం కొట్టగలరు వీళ్లు. జనసేన రంగంలోకి దిగాక.. నిఖార్సైన పోలీసులకు మళ్లీ పగ్గాలు అప్పగిస్తామన్నారు. పిఠాపురంను ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. ఇక్కడ రూ.1000 కోట్ల ఆదాయం ఉందని, జగన్ ప్రభుత్వం ఈ నగదు ఏం చేస్తుందని ప్రశ్నించారు. భక్తులకు సరైన వసతులు కూడా కల్పించడం లేదని ఏపీ ప్రభుత్వ తీరును పవన్ కళ్యాణ్ ఎండగట్టారు.


వ్యవసాయ శాఖ మంత్రి పవన్ కు అన్ని రకాల ధాన్యాలు తెలియదు అని అంటున్నారు. కానీ వైసీపీ వాళ్లకు ఏదో మొత్తం తెలిసినట్లు డ్రామాలు ఆడుతున్నారు. ఏపీ నేల కోసం నిలబడతా, వైసీపీ ప్రభుత్వం గూండాలమయం.. అయినా ఈ గూండాలను బట్టలిప్పి కొట్టిస్తాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రౌడీలు, గూండాలు, హంతకులు.. నేర చరిత్ర ఉన్నవాళ్లు మనల్ని పాలిస్తున్నారు. నాకు ఇలాంటి పాలనలో ఉండటం ఇష్టముండదు. సినిమాలో చూసేది వేరు రియల్ లైఫ్ వేరు అన్నారు. తాను మాత్రం ఏపీ కోసం ఎంతకైనా వెళ్తాననని, అందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు.