ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు కొదవ ఉండదు.. నందమూరి తారకరామారావు అధికారంలోకి రావడం మొదలు, మొన్నటికి మెన్న వైఎస్ జగన్ అధికారాన్ని దక్కించుకున్నారు. అలాంటప్పుడు నెక్ట్స్ వై నాట్ బీజేపి అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి సమావేశం గుంటూరులో...
బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని గుంటూరులో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పార్టీ సహ ఇంచార్జ్ సునీల్ దియోధర్ తదితర జాతీయ, రాష్ట్ర పార్టీ ముఖ్యులు హజరయ్యారు. ఈ సమావేశానికి బీజేపీకి చెందిన బూత్ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు.
వై నాట్ భారతీయ జనతా పార్టీ...
ఈ సమావేశంలో రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి పై చేయాల్సిన పోరాటాలకు సంబందించిన కార్యచరణను నేతలు వివరించారు. అధికార పార్టీ అరాచకాల పై చార్ట్ షీట్ ను దాఖలు చేసే క్రమంలో భాగంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపున బీజేపీ నేతలు పలువురు ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని, ఆనాడు నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించి, అధికారంలోకి రావటం, ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి పార్టి పెట్టిన తొమ్మిదేళ్ళ తరవాత ఆ పార్టి నేతలు సైతం ఊహించని విధంగా 151 సీట్లు దక్కించుకోవటం, వంటి సందర్బాలను ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితులను చూసినప్పడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదనుకోలేమని, సో వై నాట్ భారతీయ జనతా పార్టీ అని నేతలు ప్రశ్నించారు. అదే స్పూర్తితో ముందుకు వెళ్ళాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.
వైసీపీని దోషిగా నిలబెట్టేందుకే ఛార్జ్ షీట్...
రాష్ట్ర ప్రభుత్వంపై సోమువీర్రాజు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు చార్జి షీట్ వేయబోతున్నామన్నారు. వైసీపీ అవినీతి ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టి సమర శంఖం పూరిస్తోందన్నారు. ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని, మే5 నుంచి 13 వరకూ చార్జ్ షీట్ కు అవసరమైన అంశాల సేకరణ కార్యక్రమాలను తలపెట్టాలని క్యాడర్ కు సూచించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ వంటి దమ్మున్న నాయకుడికి ఇక్కడ ఎవరితో నో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల కోసం రూ5 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వానికి 40 వేల కోట్లు గృహ నిర్మాణం కోసం ఇచ్చామని అన్నారు. కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం జరగటం లేదని, సర్పంచులకు రూ8 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. సర్పంచులు గ్రామాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలని మోదీ ఆలోచన అని, అందుకు అనుగుణంగానే ఉపాధి హామీ కోసం రూ75 వేల కోట్లు ఏపీకి ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిదులు ఇచ్చిందని, అమరావతి లోనే రాజధాని ఉంటుంది పార్లమెంటులో చెప్పామన్నారు. రాజధాని కోసమే ఎయిమ్స్ ఇక్కడ కట్టించి, అమరావతికి నిధులు ఇచ్చినట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించని కారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. హైవేలు, పై వంతెనలు అనంతపురం ఎక్స్ ప్రెస్ వే అమరావతి కోసం కాదా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ దేశానికే కాదు రాష్ట్రానికి కూడా ఆయనే నాయకుడని, బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూనే.. వామపక్షాలతో మాపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.