BJP Meeting : వైసీపీ మహా దొంగల పార్టీ అంటూ బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ ధియోధర్  విమర్శలు చేశారు. ఏపీకి బుల్డోజర్ బాబా కావాలన్నారు. గుంటూరులో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో ధియోధర్ మాట్లాడుతూ.. జనసేన మిత్రపక్షమని స్పష్టం చేశారు. జనసేన నాయకులతో కలిసి ప్రజా పోరు చేయాలని సూచించారు.  ఏడాది కన్నా తక్కువ కాలం మన చేతుల్లో ఉందన్న ఆయన... గత ఎన్నికల ఫలితాలు చూసి నిరుత్సాహానికి గురికావద్దన్నారు. ఏపీలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు మోదీని ఇష్టపడుతున్నారన్నారు. బీజేపీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి మర్చిపోవాలన్న సునీల్ ధియోధర్... వచ్చిన వాళ్లని ఆహ్వానించాలన్నారు. గుంటూరు జిన్నా టవర్ పేరు మార్పు బీజేపీ అజెండాలో ఉందన్నారు. జిన్నా పట్ల జగన్ కు ఎందుకింత ప్రేమ అంటే ముస్లిం ఓట్ల కోసమే అని విమర్శించారు. ప్రజలు కట్టే పన్నులు పాస్టర్స్ కి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగన్ దళిత వ్యతిరేకి, ఫూలే , అంబేద్కర్ వ్యతిరేకి అని మండిపడ్డారు. రిజర్వేషన్ సీట్ల నుంచి గెలిచిన వైసీపీ ప్రజా ప్రతినిధులు చర్చిలకు వెళ్తుతున్నారన్నారు.  


జనసేన మిత్రపక్షం 


"జగన్ హిందువులు గురించి పట్టించుకోరు. టీటీడీలో కన్వర్టెడ్ క్రిష్టియన్స్ కు ఉద్యోగాలు ఎలా ఇస్తారు. తెలుగు భాషకు సమాధి కట్టారు. కుట్ర చేసి తెలుగు మీడియం స్కూల్స్ ను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చారు. ఆర్థికంగా పతనం దిశలో ఏపీ ఉంది. వైసీపీ మహా దొంగల పార్టీ. ఏపీకి బుల్డోజర్ బాబా కావాలి. జనసేన మన మిత్ర పక్షం. జనసేన నాయకులతో కలిసి ప్రజా పోరు చేయండి. ఏడాది కంటే తక్కువ కాలం మన చేతుల్లో ఉంది. గత ఎన్నికల ఫలితాలు చూసి నిరుత్సాహానికి గురికావద్దు. ఏపీలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం."- సునీల్ ధియోధర్ 


గుంటూరులో రాష్ట్ర స్థాయి సమావేశం 


గుంటూరు బండ్లమూడి గార్డెన్స్ లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సునీల్ ధియోధర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కమిటీ నేతలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల కన్వీనర్లు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై సోమువీర్రాజు నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఛార్జ్ షీట్ వేయబోతున్నామన్నారు. వైసీపీ అవినీతి ప్రభుత్వం మీద బీజేపీ సమర శంఖం పూరిస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నామన్నారు. మే 5 నుంచి 13 వరకూ ఛార్జ్ షీట్ కు అవసరమైన అంశాల సేకరిస్తామన్నారు. కేంద్రం ఏపీకి ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. 


అమరావతే రాజధాని 


"మనం ఎవరితోనో ఉన్నామని చాలామంది అనుకుంటున్నారు. నరేంద్ర మోదీ వంటి దమ్మున్న నాయకుడికి ఇక్కడ ఎవరితోనో ఉండాల్సిన అవసరం లేదు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల కోసం రూ.5 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వానికి 40 వేల కోట్లు గృహ నిర్మాణం కోసం ఇచ్చాం. కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం జరగటం లేదు. సర్పంచులకు రూ.8 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. వాటిని కేవలం సర్పంచుల ఖాతాల్లో మాత్రమే వేస్తామని చెప్పింది. సర్పంచులు గ్రామాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలని మోదీ ఆలోచన. ఉపాధి హామీ కోసం రూ.75 వేల కోట్లు ఏపీకి ఇచ్చాం. దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చాం. అమరావతిలోనే రాజధాని ఉంటుందని పార్లమెంటులో చెప్పాం. రాజధాని కోసమే ఎయిమ్స్ ఇక్కడ కట్టించాం, అమరావతికి నిధులు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మించని కారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి.  హైవేలు, పై వంతెనలు అనంతపురం ఎక్స్ ప్రెస్ వే  అమరావతి కోసం కాదా? నరేంద్ర మోదీ దేశానికే కాదు రాష్ట్రానికి కూడా ఆయనే నాయకుడు. "- సోము వీర్రాజు 


వైసీపీ భయపడేది బీజేపీకే 


 వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై జనపోరు నిర్వహిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం భయపడేది కేవలం బీజేపీకి మాత్రమే అన్నారు. భయపడింది కాబట్టే జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకం పెట్టారన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందన్నారు. విజయనగరంలో శ్రీరాముని విగ్రహం తెగ్గొడితే.. బీజేపీ చేసిన నిరసనతో మళ్లీ గుడి కట్టించారు. ప్రభుత్వం తప్పు చేసిన ప్రతిసారి వారిపై ఒత్తిడి తెచ్చామన్నారు. ఇసుక దోపిడీపై బీజేపీ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేరన్నారు. రాష్ట్రంలో మరో అవినీతికరమైన ప్రతిపక్షం ఉండాలనేది జగన్ వ్యూహం అని సోము వీర్రాజు విమర్శించారు.