Amaravati Updates :  అమరావతికి భూములిచ్చిన రైతులు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. సుదీర్ఘమైన పాదయాత్ర. రాష్ట్రానికి రాజధాని అవసరమని ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన తమను దారుణంగా వంచించారని వారి ఆవేదన. ఇలాంటి పరిస్థితి మరే రైతుకూ రాకూడదని వారంతా ప్రజల మద్దతు కోసం పాదయాత్ర చేస్తున్నారు. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు మాత్రం ఎదురుదాడికి దిగుతున్నారు. వారెవరూ రైతులు కాదంటున్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దా అని ప్రశ్నిస్తున్నారు.  ఈ అంశంలో స్పీకర్ కూడా ఘాటు ప్రకటనలు చేయడం చర్చనీయాంశమవుతోంది. 


ఉత్తరాంధ్ర వరకూ అమరావతి రైతుల పాదయాత్ర !


రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా పోయిన ఏపీకి .. రాజధాని కోసం ముప్ఫై వేల మంది రైతులు భూములు ఇచ్చారు. వారి పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. వారంతా న్యాయం కోసం గతంలో హైకోర్టు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేశారు. అప్పట్లో కూడా వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రకటనలు చేశారు. కానీ రైతుల పాదయాత్ర సాఫీగా సాగి పోయింది. ఆ పాదయాత్రలో ఉండగానే హైకోర్టు వారికి ఊరటనిచ్చే తీర్పు చెప్పింది. కానీ ప్రభుత్వం పాటించడం డౌట్‌గా ఉంది కాబట్టి ప్రజల మద్దతు కోసం మళ్లీ ఉత్తారంధ్ర వరకూ పాదయాత్ర ప్రారంభించారు. 


న్యాయం దక్కించుకున్నా  అమలు కావడం లేదని రైతుల ఆవేదన !


గత ప్రభుత్వం ఏకాభిప్రాయంతో అమరావతిని ఖరారు చేసింది. ఆ రోజున ఒక్క పార్టీ కానీ ప్రజాసంఘం కానీ.. ఇతర ప్రాంతాల వారు కానీ తమ ప్రాంతానికి రాజధాని కావాలని అడగలేదు. అందరూ అమరావతిని సమర్థించారు. అయితే అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. రైతులు రోడ్డున పడ్డారు. అయితే హైకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించలేరని.. అలా చేయడానికి హక్కు లేదని తీర్పు చెప్పింది. అమరావతిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఆ తీర్పును పెద్దగా పట్టించుకోవడం లేదు. 


ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు !


అమరావతి రైతులు చేస్తోంది రాజధాని యాత్ర కాదని ఉత్తారంధ్రపై దండయాత్ర అని కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలంటున్నారు. అమరావతి అందరి రాజధాని అని ఇతర పార్టీల నేతలు అంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం వచ్చింది. అయితే ఒక్క వైఎస్ఆర్‌సీపీ నేతలు తప్ప అందరూ అమరావతే రాజధానిగా ఉండాలంటున్నారు. బీజేపీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీ తెచ్చే రాజధాని వద్దంటున్నారు. గతంలో ఇలాంటి వివాదం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు విశాఖపట్నం రాజధాని అయితే అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం గుంభనంగా మాట్లాడుతున్నారు. అమరావతికే మద్దతు ప్రకటిస్తున్నారు కానీ విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ముందు ముందు ఈ రాజకీయం మరింత జోరందుకునే అవకాశం ఉంది.