TDP Meeting : బెజవాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో తమకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగుల్ మీరా సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. పార్టీ నాయకులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు పట్టించుకోకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
హాట్ హాట్ గా సమావేశం
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ తో పాటు కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ హాజరయ్యారు. అయితే ఎంపీ కేశినేని నాని కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. దిల్లీలో సమావేశాలు ఉన్నందున హాజరు కాలేదని పార్టీ నేతలు వేదికపైనే ప్రకటించారు. మరో వైపున పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఇద్దరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తమకు ఆలస్యంగా తెలియ చేయటంతో పాటు, తాము రాకుండానే సమావేశాన్ని ప్రారంభించారని వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్ లో తమ ఫోటోలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఆ ముగ్గురే టార్గెట్
ఉమ్మడి కృష్ణా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నేతలు ముఖ్యంగా ముగ్గురు వైసీపీ నాయకులు పైనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు విజయవాడ తూర్పు వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పై విమర్శలు గుప్పించారు. ప్రధానంగా కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, రాజకీయంగా ఎలాంటి కామెంట్స్ అయినా తాము రిసీవ్ చేసుకుంటామన్నారు. వ్యక్తిగతంగా ఇంట్లో మహిళలను కూడా రాజకీయాల్లోకి లాగి జుగుత్సాహకరంగా వ్యాఖ్యలు చేయటంపై అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుని కొడాలి నాని, వల్లభనేని వంశీ డీఎన్ఎ టెస్ట్ చేయించాలని టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ ఫైర్ అయ్యారు. ఎవరైనా తండ్రి వద్ద తెచ్చుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని, మరి చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకువెళ్లిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న త్రీ ఇడియట్స్ కు త్వరలోనే బుద్ది చెబుతామని హెచ్చరించారు.
రక్తం మరిగిపోతుంది - వర్ల రామయ్య
పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా వైసీపీ నాయకుల తీరు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లిలాంటి భువనేశ్వరిపై కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తుంటే, రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవినేని అవినాష్ కు దమ్ముంటే గద్దె రామ్మోహన్ పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తెలుగు దేశం పార్టీ నుండి మంత్రి పదవి దక్కదనే కోపంతోనే కొడాలి నాని వైసీపీలో చేరారని ఆరోపించారు. తెలుగు మహిళలు గుడివాడ వస్తుంటే వైసీపీ నేతలు బెదిరిపోయారని ఎద్దేవా చేశారు.
దూకుడు పెంచాలి
టీడీపీ కార్యకర్తలు దూకుడు పెంచాలని నేతలు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఎదుర్కొని నిలబడతామని, అధికారంలోని వచ్చిన వెంటనే తామేంటో కూడా చేసి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే నాయకులంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు. గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.