Amaravati Padayatra :  అమరావతి రైతుల పాదయాత్ర లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెనాలి ఐతానగర్ వైపు పాదయాత్రకు అనుమతి లేద‌ని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బారికేడ్లు పెట్టి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్లను స్థానికులు నెట్టివేశారు. పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. హైకోర్టు అనుమతి  మేరకు యాత్ర చేస్తున్నామని పోలీసులు అడ్డుకోవడం సరి కాదని రైతులు వాదించారు. అయితే రైతులు వెళ్లాలనుకున్న దారిలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసం ఉందని  అటు వద్దని పోలీసులు స్పష్టం చేశారు.  అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతి రావు  కోర్టు అనుమతులను ధిక్కరించకూడదు కాబట్టి... పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్టాండు ప్రాంతం మీదుగా చినరావూరు, జంగడిగూడెం మీదుగా పాదయాత్ర మార్చుకుంటామని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. 


అపూర్వ స్వాగతం లభిస్తోందంటున్న రైతులు


పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందని, ఊహించిన దానికన్నా మిన్నగా ఆదరణ లభిస్తుండడంతో అమరావతి రైతును అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం కుట్ర చేస్తుంద‌నిన రైతులు మండిప‌డుతున్నారు. వైసీపీ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు హాజరై పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ప్రజలు అడుగడుగునా రైతులకు బ్రహ్మరథం పడుతున్నారని రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.రెండో విత‌డ‌గా ప్రారంభం అయిన పాద‌యాత్ర ను ఉద్దేశించి మంత్రులు కూడ ఫైర్ అవుతున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే లా ఒక ప్రాంత వాసులు వ్యవహరిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


మూడు రాజధానులు ఖాయమంటున్న మంత్రులు 


బౌన్సర్లు పెట్టుకుని రైతులు పాదయాత్ర చేయడం ఏంట‌ని ప్ర‌శ్నించారు. నిజమైన రైతులు ఎలా ఉంటారో ప్రజలకు తెలుసని, నేను రైతు బిడ్డనే అని, జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన  వ్యక్తి గతంగా మూడు రాజధానుల నే కోరుకుంటున్నాన‌న్నారు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి చోట్ల పెట్టుబడులు పెట్టేసి అంతా కోల్పోయాం, మళ్ళీ అదే తప్పు ఎందుకు చేయాల‌ని, అందుకే మా ప్రభుత్వ నిర్ణయం మూడు రాజధానుల కావాలనే కోరుకుంటుంద‌ని తెలిపారు. రైతులు పాదయాత్ర చేసినంత మాత్రాన మూడు రాజధానుల నిర్ణయం ఆగదన్నారు.


రైతుల పాదయాత్రకు పెద్ద ఎత్తున విరాళాలు
 
అమరావతి మహాపాదయాత్ర చేస్తున్న బృందానికి అధికంగా విరాళాలు ఇస్తున్నారు. రెండో రోజు పాదయాత్రలో పెదవడ్లపూడి గ్రామస్థులు రూ.4 లక్షలను అమరావతి జేఏసీ ప్రతినిధి ఆరే శివారెడ్డికి టీడీపీ నాయకులు జవ్వాది కిరణ్‌చంద్‌, మాదల రమేష్‌, అన్నే చంద్రశేఖర్‌, బోయపాటి రవి, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు అందజేశారు. పాదయాత్రికులకు విందు కూడా ఏర్పాటుచేశారు. మంగళగిరి వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు కంతేటి నాగేశ్వరరావు, అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు తదితరులు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి రూ.10,116లను విరాళంగా అందజేశారు. పాదయాత్రకు ఆది నుంచి అండగా ఉన్న సీపీఐ పార్టీకి చెందిన పెదవడ్లపూడి గ్రామ కమిటీ రూ.లక్ష విరాళాన్ని అందించింది.  గుంటూరుకు చెందిన శ్రీవెంకటేశ్వర వాకింగ్‌ ట్రాక్‌ అసోసియేషన్‌ సభ్యులు రూ.1,51,116 అందజేశారు. అసోసియేషన్‌ సభ్యులు దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు వద్ద అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, తిరుపతిరావులకు ఈ మొత్తాన్ని అందజేశారు.