ఏపీలో తెలుగు దేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ పై మరో దాడి జరిగింది. ఈసారి గుంటూరు జిల్లా తెనాలిలో కొంత మంది దుండగులు అన్నా క్యాంటీన్‌కు నిప్పు అంటించారు. శనివారం అర్ధరాత్రి దాటాక (ఆదివారం డిసెంబరు 18) అన్నా క్యాంటీన్‌ తలుపు వద్ద నిప్పు పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు పారిపోయారు. అటు నుంచి వెళ్తున్న కొంత మంది మంటలు రాజుకుంటుండడం గమనించి ఆర్పేశారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు.


నిత్యం ప్రజలు ఉండే ప్రధాన కూడలి మార్కెట్ సెంటర్లో అన్నe క్యాంటీన్ కి నిప్పుపెట్టటం పట్ల టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులతో టీడీపీ శ్రేణులకి మధ్య ఒకింత వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


గత రాత్రి నిప్పు పెట్టిన అన్న క్యాంటిన్ ని టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు పరిశీలించారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడుతూ - పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను దహనం చేయటం దుర్మార్గం అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం, వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చకపోగా చేసే వారికి అడ్డు తగలడం దారుణం అని అన్నారు. ప్రశాంత వాతావరణలో ఉండే తెనాలిలో ఇలాంటి దుశ్చర్యలు చోటు చేసుకోవడం బాధాకరం అని వాపోయారు. అన్నా కాంటీన్ కు నిప్పు పెట్టిన దుండగులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.


టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో తెనాలి పట్టణంలో కూడా అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని అన్నా క్యాంటీన్ల మాదిరిగానే ఇదికూడా మూతపడింది. అప్పటి నుంచి వినియోగంలో లేకుండా ఉంది. తాజాగా ఈ క్యాంటిన్ నామరూపాలే లేకుండా చేయాలని భావించారో ఏమో అర్ధరాత్రి నిప్పంటించి కాలిబూడిద చేసే ప్రయత్నం చేసారు. కానీ మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి ఆర్పారు.


ఇటీవల తెనాలి మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న ఆ అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాలని స్థానిక టీడీపీ నేతలు భావించారు. అయితే రూ.5 కే ఆహారం కోసం భారీగా ప్రజలు గుమిగూడే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. అయినా వెనక్కి తగ్గని టీడీపీ నేతలు ఉద్రిక్తతల మధ్యే క్యాంటిన్ వద్ద పేదలకు భోజనాన్ని పంపిణీ చేశారు.


ఎలాంటి అనుమతులు లేకుండా అన్నా క్యాంటీన్ ను నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆహారం తెచ్చే వాహనాన్ని మధ్యలోనే నిలిపారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు ఇటీవల అన్నా క్యాంటీన్ ను మూసివేయించారు. తాజాగా నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుంది.