AP Finance Minister Buggana Rajendranath Reddy: 
- ప్రజా సేవలపై జీఎస్టీని ఎత్తివేయాలి
- 48వ జీఎస్టీ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆర్థిక మంత్రి బుగ్గన
అమరావతి : ఢిల్లీలో జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో  రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. భారత రాజ్యాంగంలోని 11వ మరియు 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా పారిశుధ్యం, ఆరోగ్యం, అటవీ తదితర ప్రజా సౌకర్యాలను అమలు చేసే సేవలపై వస్తు, సేవల పన్ను (GST)ని మినహాయించాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన కోరారు. ఇన్‌పుట్ ట్యాక్స్ ప్రభావం లేనందున, మ్యాన్ పవర్ సేవలను అందించడం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఏపీసీవోఎస్(APCOS) ద్వారా ప్రభుత్వానికి , ప్రభుత్వ సంస్థల కోసం ఏర్పాటు చేసిన మానవ వనరులను మినహాయింపు జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. 
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పరిగణనలోకి..
ఆదాయాల లీకేజీని అరికట్టడానికి మెరుగైన డేటా అనలిటిక్స్ కోసం ఇతర ప్రభుత్వ శాఖల నుండి సమాచారాన్ని పంచుకోవడంపై ఆయన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జీఎస్టీఆర్ 2ఎ యొక్క తప్పనిసరి షరతు లేకపోవడం, బీమా కంపెనీల ద్వారా నాన్ క్లెయిమ్ బోనస్ మినహాయింపుల ప్రకారం.. డీలర్ల సౌలభ్యం కోసం  చేపట్టిన సవరణలు  2017-18, 18-19, 19-20లో కొంత భాగానికి సంబంధించిన CA ధృవీకరణ ఆధారంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి చేపట్టిన  కేంద్ర ప్రతిపాదనలకు  మంత్రి బుగ్గన మద్దతు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ సదస్సుకు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎన్. గుల్జర్ (ఆదాయపు పన్నులు), రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఎం. గిరిజా శంకర్ తదితరులు హాజరయ్యారు.


జీఎస్‌టీలో భారత్‌ రికార్డులు 
జీఎస్‌టీ రాబడిలో భారత్‌ రికార్డులు సృష్టిస్తోంది. వరుసగా తొమ్మిదో నెలా రూ.1.40 లక్షల కోట్లకు పైగా వస్తు సేవల పన్ను ఆర్జించింది. నవంబర్లో రూ.1.46 లక్షల కోట్ల రాబడి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్‌తో పోలిస్తే రాబడి 3.9 శాతం తగ్గగా గతేడాది నవంబర్‌తో పోలిస్తే 10.9 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.52 లక్షల కోట్లు కాగా గతేడాది నవంబర్లో రూ.1.32 లక్షల కోట్లని కేంద్రం తెలిపింది.


తెలంగాణ 2021 నవంబర్లో రూ.3931 కోట్లు వసూలు చేయగా 2022 నవంబర్లో రూ.4,228 కోట్లు వసూలు చేసింది. 8 శాతం వృద్ధి నమోదు చేసింది. ఆంధప్రదేశ్ గతేడాది నవంబర్లో రూ.2750 కోట్లు ఆర్జించగా ఈసారి 14 శాతం వృద్ధితో రూ.3134 కోట్లు పొందింది. 


'2022 అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్లో జీఎస్‌టీ రాబడి కాస్త తగ్గింది. ఆ త్రైమాసికం ముగింపు రాబడి తర్వాతి నెలలో ప్రతిబింబించింది. ఏదేమైనా ఎకనామిక్‌ యాక్టివిటీ ప్రతి నెలా పెరుగుతోంది' అని ఐసీఆర్‌ఏ చీఫ్ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. 'పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్లో జీఎస్‌టీ వసూళ్లు ఎక్కువగా కనిపించాయి. ఎక్కువ సెలవులు రావడంతో జీఎస్‌టీ ఈవే బిల్లులు తగ్గాయి' అని నాయర్‌ వెల్లడించారు.