ఇసుక అక్రమ తవ్వకాలపై తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు జరిగిన ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది పార్టీ అధినాయకత్వం
మొదటి రెండు రోజులు ఇసుక అక్రమ రీచ్‌ల వద్ద నిరసనలు తలపెట్టి తెలుగుదేశం పార్టీ 30వ తేదీన మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ శ్రేణులు రెండు రోజుల నుంచి ఇసుక క్వారీల వద్ద నిరసన తెలిపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 67 క్వారీలను గుర్తించగా 44 ప్రధాన క్వారీలలో ‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమం జరిగిందని టీడీపీ ప్రకటిచింది. అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలతో ఆందోళనలు అడ్డుకునే ప్రయత్నం అధికార్ పార్టీ చేసిందని ఆరోపించింది టీడీపీ. అయినా వాటిని లెక్క చేయకుండా ఇసుక అనుమతులు, లెక్క తేల్చాలని నేతల పట్టుబట్టటంతో ప్రభుత్వం ఇరకాటంలోకి వెళ్ళిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇసుక దొంగలను అరెస్టు చేసి, ఉచిత ఇసుక విధానం తీసుకురావాలేని తెలుగు దేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
రోడ్డున పడుతున్న కార్మికులు...
జగన్ రెడ్డి ఇసుక దోపిడీతో 123 వృత్తులు, వ్యాపారాలు రోడ్డున పడ్డాయని తెలుగు దేశం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నోట్లో జగన్ రెడ్డి మట్టి కొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని టీడీపీ చీప్ చంద్రబాబు 48 గంటల గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీకి చెందిన శ్రేణులు రోడ్డెక్కాయి. మూడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా 2 రోజులు ఇసుక ర్యాంపుల వద్ద ప్లకార్డులు పట్టుకుని అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొండలను తలపించేలా ఉన్న ఇసుక గుట్టలను పరిశీలించారు.
ప్రకృతిని నాశనం చేస్తూ, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఇసుక తవ్వకాలు జరిపి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. అక్రమ క్వారీలకు సంబంధించిన ఆధారాలు అంటూ మీడియాకు చూపించారు. టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, NGT విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్, ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు
ఇసుక తవ్వకాలపై తెలుగు దేశం పార్టీ ఆందోళనకు పిలుపునివ్వటంతో ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. శ్రీకాకుళం నుంచి అనంతపుర వరకు వివిధ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలందర్నీ గృహనిర్బంధం చేశారు ఇసుక క్వారీల విజిట్‌కు వెళ్ళకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఇసుక సత్యాగ్రహాల నిరసనలను తెలుగు దేశం పార్టీ ఇవాళ కూడా కొనసాగిస్తోంది. టీడీపీ పిలుపుతో రెండో రోజు కూడా వివిధ ప్రాంతాల్లో ఇసుక క్వారీలకు సమీపంలో సిబ్బందిని మోహరించారు పోలీసులు. బుధవారం మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు విజయవాడలోని అన్ని మార్గాలపై నిఘా పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ లీడర్లు, శ్రేణులు విజయవాడ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.