Amaravati Capital :   ఏపీ రాజధానిగా అమరావతిని వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఖర్చు. 29 గ్రామాల్లోనే లక్ష కోట్లకుపైగా ఖర్చుపెట్టి రాజధాని అభివృద్ధి  చేయడం వల్ల ఆర్థికంగా నష్టం అని ప్రభుత్వం వాదిస్తోంది. అన్ని నిధులు ప్రభుత్వం వద్ద లేవని స్పష్టం చేస్తోంది. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ వర్గాలు భిన్నమైన స్పందన వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వ డబ్బులు పెట్టాల్సిన పనే లేదని అంటోంది. ఎవరి వాదన కరెక్ట్ ?


అమరావతిపై ప్రభుత్వ వాదన ఏమిటంటే ? 


అమరావతికి రూ. లక్షా తొమ్మిది వేల కోట్లు ఖర్చవుతుంది.. ఇప్పటి వరకూ.. ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అని ప్రభుత్వం అమరావతి గురించి ప్రకటన చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ చెబుతూ ఉంటుంది. ఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వంలో  ఏమేం చేశారో చెబుతూ.. కొన్ని శ్వేతపత్రాలను విడుదల చేశారు.  సీఆర్డీఏ వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో.. అమరావతి కోసం గత ప్రభుత్వం  9,165 కోట్లు ఖర్చు చేసిందని..స్పష్టం చేసింది. మిగతా లక్ష కోట్లను ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఆలస్యమయ్యే కొద్దీ ఆ ఖర్చు పెరుగుతుదని.. అందుకే  అమరావతి ఏ మాత్రం లాభదాయకమైన ప్రాజెక్ట్ కాదని స్పష్టం చేస్తోంది. 


తెలుగుదేశం పార్టీ వాదన ఏమిటంటే ? 


అమరావతి విషయంలో గత ప్రభుత్వం పక్కా ప్రణాళికలు వేసుకుందvf.. ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టాలి.. ఎలా నిధుల సమీకరణ చేయాలన్న అంశాలపై.. ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. .  ఈ మేరకు అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఫిభ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 50ను విడుదల చేసిందని చెబుతున్నారు.  ఈ ప్లాన్ ప్రకారం... అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు 55,343 కోట్లు. ఇందులో రాబోయే 8 ఏళ్లలో ఖర్చు పెట్టాల్సింది కేవలం 6629 కోట్లు మాత్రమే. రాజధానిని ప్రభుత్వం మొదటి నుంచి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా చెబుతూ వస్తోంది. భూములకు మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత.. వాటి విలువ పెరుగుతోంది. అప్పుడు ..  ప్రభుత్వానికి మిగిలే భూమితో సంపాదించుకునే ప్రణాళికలను ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని టీడీపీ నేతలు.. అమరావతి ఖర్చుపై చర్చ జరిగిన ప్రతీ సారి వెల్లడిస్తున్నారు. 


పట్టణీకరణకు ఓ అద్భుతమైన విధానమని అంతర్జాతీయ ప్రశంసలు !
 


అమరావతిలో ఆర్థిక నిపుణలు ఓ గొప్ప ఆర్థిక నమూనాను చూశారు.  పట్టణీకరణకు ఓ అద్భుతమైన దిక్సూచీగా మారబోతోందని అంచనా వేశారు. 33వేల ఎకరాలు సమీకరించిన విధానం..  ఆ ప్రాజెక్ట్ పై.. దేశవ్యాప్తంగా విశ్వాసం పెరగడానికి కారణం అయింది.  అమరావతి మోడల్ సక్సెస్ అయితే..  పట్టణీకరణలో కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఎందుకంటే..  వరల్డ్ క్లాస్ సిటీ.. సెల్ఫ్ ఫైనాన్షింగ్ ద్వారా పూర్తి కావడం అంటే.. ఓ గొప్ప సక్సెస్ మోడల్ దొరికినట్లే.  మొదటి బడ్జెట్‌లో అమరావతికి కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చిన వైనం.. ఆ తర్వాత సింగపూర్ తో ఒప్పందం రద్దు చేసుకోవడం వంటి ఆంశాలపై.. బిజినెస్ నిపుణులు తీవ్రంగా స్పందించారు.  మోహన్ దాస్ పాయ్ లాంటి పారిశ్రామికవేత్తలు.. శేఖర్ గుప్తా లాంటి జర్నలిజం దిగ్గజాలు కూడా..అమరావతిపై జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు.


ఆర్థికంగా ఎంతో లాభం !


అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్థికంగా ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం వచ్చి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. అమరావతిని నిలిపివేసే సమయానికి ప్రైవేటు సంస్థలుకూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ఇలాంటి లావాదేవీలు యాభై వేల కోట్ల వరకూ ఉంటాయని అంచనా . అంటే అందులో దాదాపుగా వివిధ ఫన్నుల రూపంలో ప్రభుత్వానికి ఇరవై శాతానికికిపైగా లభిస్తుంది. అమరావతిని నిర్వీర్యం చేసినా అక్కడ భూమి ఎకరాలకు పది కోట్ల విలువ ఉంటుందని ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నిస్తోంది. అంటే అమరావతిలోనే రాజధాని ఉంచిఉంటే ఇంకా ఎక్కువ రేటు పలికేది. ఈ సంపద సృష్టి అంతా ఆగిపోయిందని నిపుణులు చెబుతున్నారు.