YSR Kalyanamasthu Scheme: ఏపీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం అక్టోబరు 1 నుంచి ప్రారంభం కాబోతోంది. కానీ, ఇంతకుముందు ముందుతో పోల్చితే తాజాగా అర్హత నిబంధనలను ప్రభుత్వం పెంచింది. శనివారం (సెప్టెంబరు 10) ఈ పథకానికి సంబంధించి అర్హత నిబంధనలను విడుదల చేశారు. వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులైతేనే వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, ముస్లింలకు షాదీ తోఫా పథకాలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం కండీషన్ పెట్టింది. ఆ ఉత్తర్వుల్లో వధూవరులిద్దరూ పదో తరగతి పూర్తిచేసి ఉండాలని మాత్రమే ఉంది. అయితే, వారు వారు ఫెయిల్‌ అయితే ఏంటి పరిస్థితి అనేది ప్రస్తావించలేదు. పదో తరగతి పూర్తి చేసి ఉండాలనే నిబంధన 2024 జూన్‌ తర్వాత అమల్లోకి వస్తుందని అందులో తెలిపింది. తాజాగా ఆ మినహాయింపును తొలగించారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ మార్పు చేసినట్లు పేర్కొంది.


వయసు నిబంధన తప్పనిసరి
అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 ఏళ్లు కచ్చితంగా నిండాలి. గ్రామాల్లో ఆదాయం నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో అయితే నెలకు రూ.12 వేలకు మించకూడదు. వారి ఇళ్లలో నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. కుటుంబంలో ఇన్ కం ట్యాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు.


తాజాగా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రకటించిన అర్హత షరతులు చూస్తే.. అన్ని సంక్షేమ పథకాల లాగానే కల్యాణమస్తు, షాదీ తోఫా పథకానికి 6 దశల్లో తనిఖీలు ఉంటాయని తెలుస్తోంది. వధూవరులిద్దరి కుటుంబ సభ్యుల వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించకూడదు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్ఆర్ కల్యాణమస్తు వర్తించనుంది. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు రూ.లక్ష, ఒకవేళ వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు ఇస్తారు. బీసీలకు రూ.50 వేలు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేల ఆర్థిక సాయం ఉంటుంది. మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులైతే రూ.1.50 లక్షలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది. 


తొలుత నిలిపివేత
గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకుని పెళ్లి కానుక పథకాన్ని అమలు చేశారు. 2019లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాల కింద తాము పెంచిన ఆర్థిక సాయం 2020 శ్రీరామనవమి నుంచి చేస్తామని జీవో ఇచ్చింది. కానీ, కరోనా కారణంగా చూపి ఆ పథకాన్ని నిలిపివేశారు. గత ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన దుల్హన్ పథకాన్ని కూడా నిలిపివేశారు. దుల్హన్ పథకం నిలిపివేయడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో, నిధులు లేకపోవడంతోనే పథకాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ పథకం అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానుంది.