TDP Vs YSRCP : టీడీపీ ఆఫీస్‌, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్‌కు హైకోర్టు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 16కు వాయిదా వేసింది. 


టీడీపీ జాతీయ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘు, అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌కు ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చర్యలేం తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ పోలీసులను హైకోర్టు ఆదేశాలుజారీ చేసింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక సూచనలు చేసింది. వచ్చే విచారణ వరకు చర్యలేం తీసుకోవద్దని స్పష్టం చేసింది. 


2021 అక్టోబర్ 19న గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్రం కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదు చేసినా నాటి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం మారిన తర్వాత కేసుల విచారణ వేగవంతమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకు నాటి ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. 


సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఓవైపు ఈ కేసులోనే గుంటూరు జిల్లా పోలీసుల విచారణ కొనసాగుతోంది. రెండు వైపుల విచారణతో వైసీపీ నేతలు కాస్త కంగారు పడ్డారు. కొందరు కీలక కార్యకర్తలను అరెస్టు కూడా చేశారు. చర్యలు తీసుకోవద్దని కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. 
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఇప్పటికే కీలక నేతల అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ఆఫీస్‌లో ఉన్న సీసీ ఫుటేజ్‌, ఆ ప్రాంతాల్లో ఉన్న ఇతర సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకొని కేసును విచారించారు. ఇలా విచారించి 27 మందిని గుర్తించారు. వారిలో 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో గుంటూరు జిల్లాకు చెందిన శ్రేణులే ఎక్కువమంది ఉన్నారు. 


దర్యాప్తు సీరియస్‌గా జరుగుతుందని గ్రహించిన చాలా మంది వైసీపీ కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు గుంటూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలు వెంకట్ రెడ్డి, మస్తాన్ వలి, దేవానందం, రాంబాబు, మొహియుద్దీన్‌ సహా పది మందిని అరెస్టు చేశారు. 
అరెస్టు అయిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు ఉండటంతో ఆయన హస్తం ఉందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆయనతోపాటు అవినాష్ సహా కీలక నేతల ముఖ్య అనుచరుల ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా అంతా కోర్టును ఆశ్రయించారు. 


మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్నటైంలో 2021 సెప్టెంబర్‌లో జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇంటిపై దాడికి వెళ్లారు. టీడీపీ నేతలు జగన్‌పై పరుషపదజాలంతో విమర్శలు చేస్తున్నారని దానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ చర్యకు పూనుకున్నారు. అదే టైంలో అక్కడకు టీడీపీ లీడర్లు రావడంతో అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. అప్పటి అధికారంలో ఉన్న వైసీపీ లీడర్లు టీడీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో బుద్దా వెంకన్న లాంటి వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


దీనిపై అప్పుడే టీడీపీ లీడర్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వాటి దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఇందులో ప్రధాన నిందితుడిగా జోగి రమేష్‌ను చేర్చారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు బెయిల్‌పై నిర్ణయం తీసుకోలేదు కానీ ఎలాంటి చర్యలు వద్దని మాత్రం ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.