Pawan kalyan: ఎన్డీయే నుంచి జనసేన బయటకు వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. జనసేనపై కావాలని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. జనసేన ఇప్పటికీ ఎన్డీయేలోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. తాము ఎవరితో ఉండాలి.. ఏ పార్టీతో కలిసి పోటీ చేయాలనేది తమ పార్టీ అంతర్గత విషయమని తెలిపారు. తాము ఎవరితో కలిస్తే వైసీపీకి ఏంటి? అని పవన్ ప్రశ్నించారు.


శుక్రవారం మంగళగిరిలో పవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ప్రజా సమస్యలపై జనసేన పోరాటం కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం కోసం వైసీపీని నిలదీస్తా.. జనవాణిలో తమ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు సరిగ్గా రావడం లేదు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమస్యల్లో ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. నిరసన తెలిపినా కేసులు పెడుతున్నారు. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌లకు 20వ తేదీ వరకు జీతం పడకపోవడం దారుణం.. మచిలీపట్నంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు మా దృష్టికి తెచ్చారు' అని పవన్ తెలిపారు. 


'జనసేన దృష్టికి తెస్తే మా ఉద్యోగాలు ఉంటాయా..? లేదా? అని కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలన్నదే నా ఆకాంక్ష.. 30 మంది ఎంపీలు ఉన్నారని ఢిల్లీకి వెళ్లి కాఫీలు, టీలు తాగడం కాదు.. మీపై ఉన్న కేసులు వాయిదా వేయించుకోవడం కాదు.  తెలంగాణకు ఇచ్చిన వరాలు ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ఢిల్లీకి వెళ్లి జగన్ అడగాలి. మోదీ జీ20 ప్రోగ్రామ్‌లో బిజీగా ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారు.. నేను నా ప్రోగ్రామ్స్‌ కోసం వెళ్తుంటే నన్ను కూడా ఆపేశారు. జీ20 ప్రొగ్రామ్‌పై బీజేపీ నేతలు బిజీగా ఉన్నారని నేనే పొత్తు గురించి ప్రకటించేశాను' అని పవన్ తెలిపారు 


'2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలనేది నా ఆకాంక్ష.. చంద్రబాబు అరెస్ట్‌లో జగన్ నక్క జిత్తులు ఉపయోగించారు. దీనిపై ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీని అప్రోచ్ కాలేకపోయా.. కేసుల గురించే జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది వైసీపీకి అనవసరం.. మేం ప్రజలకు మాత్రమే సమాధానం చెబుతాం.. సినిమా ఇండస్ట్రీలో చాలా పొలిటికల్ గ్రూప్స్ ఉంటాయి..సినీ ఇండస్ట్రీ చాలా సున్నితమైనది.. ఎవరైనా మాట్లాడితే వారిని టార్గెట్ చేస్తారని భయపడతారు' అని పవన్ పేర్కొన్నారు.


ఈ సందర్బంగా వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడినుంచే పోటీ చేస్తాననే దానిపై పవన్ స్పందించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది స్వీయ నిర్ణయం మేరకు ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేయగా.. ఆ రెండు నియోజవర్గాల్లో పవన్ ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వేరే స్థానం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది. తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.