Kodali Nani on Pawan Kalyan: 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పావలా అని, అందుకే తమది రూపాయి పావలా ప్రభుత్వం అని అన్నాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రూపాయి పావలా ప్రభుత్వమంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 125 సీట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయం అన్నారు. పవన్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీకి, జనసేనకు కలిపి ఈ ఎన్నికల్లో 25 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటూ సెటైర్లు వేశారు కొడాలి నాని. పవన్ మొరిగే కుక్క తప్ప, కరిచే కుక్క కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


నీ బాబు నన్ను ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓ సీనియర్ నేత పలుమార్లు అన్నారు, ఇప్పుడు ఆ నేత జైల్లో ఉన్నాడంటూ కొడాలి నాని చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దత్త తండ్రి మార్గంలో పవన్ కళ్యాణ్ నడుస్తారని, త్వరలోనే ఆయనకు కూడా ఇలాంటి గతే పడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ పావలా అని, తాము రూపాయి పావలా అంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 125 సీట్లు వస్తాయని చెప్పేశారంట సెటైర్లు వేశారు. 


నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ లు చంద్రబాబును కలవడం కొత్త కాదంటూ ఏళ్ల తరబడి వాళ్లు కలిసే ఉన్నారంటూ జైలులో ములాఖత్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ శబ్దాలు చేయాలని, అరవాలని, గోల చేయాలని టీడీపీ వాళ్లు ఇచ్చిన పిలుపునకు పెద్దగా రెస్పాన్స్ రాలేదన్నారు. గతంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇదే విధంగా శబ్దాలు చేసి నిరసన తెలపాలంటే ఆయనను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే గతి పట్టిందన్నారు కొడాలి నాని.


జగన్ ప్రభుత్వంపై పవన్ ఏమన్నారంటే..
ఏపీ సీఎం జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రలో అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన- టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్లు వేయించుకునేందుకే, వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. మరోవైపు నిధుల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని కేంద్రం చెప్పిందన్నారు. రాష్ట్రం బాగుండాలంటే కులాలను దాటి రాజకీయాలు ఉండాలన్నారు. బీసీలను బీసీల చేత, కమ్మ వారిని కమ్మ వారి చేత తిట్టిస్తారని.. ఇదేనా వైసీపీ రాజకీయం అని ప్రశ్నించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర యువత కూడా కులాలకు అతీతంగా ఆలోచించాలన్న ఆయన, మన మధ్య ఉన్న విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతలను ఆయా కులాల వారితో తిట్టించడం జగన్‌ నైజమన్న పవన్ కల్యాణ్, సీఎం జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము కూడా లేదన్నారు. సోనియా గాంధీ చూస్తారని భయపడి చాటుగా ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. ఇసుక, కొత్త పాస్ బుక్, రొయ్యల చెరువు ఇలా అన్నింట్లోనూ లంచాలు, అవినీతి పేరుకుపోయిందని పవన్ మండిపడ్డారు.