YSRCP Tickets Issue: ఏపీలో వైసీపీ టికెట్లు ఒక్కొక్కటే ఖరారవుతున్నాయి. కొత్తగా ఇన్ చార్జ్ ల నియామకంతో సీఎం జగన్ స్పీడ్ పెంచారు. వైనాట్ 175 అంటూ.. ఎన్నికల్లో కూడా ఆ జోరు చూపించాలని ముందుగానే అభ్యర్థుల సెలక్షన్ చేపట్టారు. అయితే ఈ సెలక్షన్.. ఎలక్షన్ నాటికి చాలా చోట్ల రివర్స్ అయ్యేలా కనపడుతోంది. ఇప్పటికే చాలామంది అసంతృప్తులు తమ సంగతేంటని నిలదీస్తున్నారు. ఈ బేరాలు నచ్చనివాళ్లు.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ లాగా పక్క పార్టీల్లోకి జారుకుంటున్నారు. తాజాగా వైసీపీ నుంచి మరో ఎమ్మెల్సీ తిరుగుబాటు ధోరణితో మాట్లాడారు. 


ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనకు గురజాల వైసీపీ సీటు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. గురజాలలో పోటీ చేసే హక్కు తనకు ఉందని అన్నారాయన. అందుకే అధిష్టానాన్ని సీటు కోరుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం ప్రభుత్వ విప్ కూడా. ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం 2025తో పూర్తవుతుంది. దీంతో ఆయన ముందుగానే తన మనసులో మాట బయటపెట్టారు. అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్నారు. తన నియోజకవర్గం గురజాలలోనే తనకు ఆ అవకాశం ఇవ్వాలంటున్నారు. 


గతంలో రెండు సార్లు తాను గురజాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు జంగా కృష్ణమూర్తి. 2019లో కూడా పార్టీ అవసరాల మేరకే తాను ఆ సీటు త్యాగం చేశానని చెబుతున్నారాయన. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ తన వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారని, అవమానాలకు గురి చేశారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే అంటే కేవలం ఓ వర్గం వాళ్ళకి మేలు జరిగేలా వ్యవహరిస్తే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు జంగా కృష్ణమూర్తి. ఎందుకిలా జరుగుతుందో పార్టీ గమనించాలని అంటున్నారు. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా ఉన్న తనను కలవడానికి కూడా వైసీపీ క్యాడర్ కి పర్మిషన్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. తనను కలవడానికి వచ్చేవారిపై తప్పుడు ప్రచారాలు చేయడం దేనికంటున్నారు జంగా కృష్ణమూర్తి. 


ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..
గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్.. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గాలుగా వైసీపీలో విభజన జరిగింది. ఇద్దరూ ఆ నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేతో జంగాకు ఏమాత్రం పొసగడంలేదు. ఆయన సొంతగా మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. తన వర్గాన్ని ఓ చోటకు చేరుస్తున్నారు. ఎమ్మెల్యే సమావేశాలకు తనను పిలవనప్పుడు, తాను నిర్వహించే సమావేశాలకు ఎమ్మెల్యేను ఎందుకు పిలవాలని లాజిక్ తీస్తున్నారు జంగా. అధిష్టానానికి కూడా ఇదే విషయం చెప్పానంటున్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నానని తేల్చి చెప్పారు జంగా కృష్ణమూర్తి. 


బీసీ కార్డు..
ఇక్కడ జంగా కృష్ణమూర్తి బీసీ కార్డు కూడా ఉపయోగిస్తున్నారు. వైసీపీ.. బీసీ సాధికారిత కోసం కట్టుబడి ఉందని నమ్ముతున్నానన్నారు జంగా. అందుకే బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నానని చెప్పారు. జిల్లాలో ఒకరిద్దరు బీసీలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలనే రూల్ ఏమీ లేదన్నారాయన. అవసరాన్ని బట్టి, గెలుపు గుర్రాలను బట్టి ఎన్ని టికెట్లయినా ఇవ్వొచ్చన్నారు. 


మొత్తమ్మీద.. ఇన్ చార్జ్ ల మార్పు, అభ్యర్థుల ప్రకటన వంటి అంశాలతో జగన్ కి కాస్త ముందుగానే సెగ మొదలైందని అనుకోవాలి. టికెట్ రాదు అని తెలిసిన సిట్టింగ్ లలో కొందరు పైకి సైలెంట్ గానే ఉంటున్నా, జగన్ తోనే తమ ప్రయాణం అంటున్నా వారిని చివరి వరకు నమ్మే పరిస్థితి లేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో రివర్స్ అయ్యే అవకాశముంది. కొంతమంది మాత్రం ముందుగానే టికెట్ ఇచ్చే పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇంకొందరు ఇలా ముందుగానే బయటపడుతున్నారు. తమకు టికెట్ కావాల్సిందేనంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఒత్తిడిని జగన్ ఏ మేరకు తట్టుకోగలరో చూడాలి.