వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) ఆశావహ నేతలకు టెన్షన్ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ( Assembly Elections 2024 ) పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. జాబితాలో తమ పేరు ఉంటుందా ? లేదా ? అన్న వణకు నేతల్లో మొదలైంది. ఎన్నికల ముందు వైసీపీలో భారీ మార్పులు జరుగుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేల్ని పిలుస్తున్న జగన్ (Jagan).. టికెట్ ఉందా.. లేదా అని తేల్చేస్తున్నారు.
వేటు ఎవరికి- ట్రాన్స్‌ఫర్ ఎవరికి?
కొంతమంది నేతల స్థానాలు మారుతుంటే... మరికొందరికి టికెట్టే గల్లంతవుతోంది వైఎస్‌ఆర్‌సీపీలో. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లుంటే.. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో 60 నుంచి 70 మందిని మార్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సగం మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదనే అంచనా జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడారు. బలాలు, బలహీనతలపై చర్చిస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. గెలుపే ప్రామణికంగా మార్పులు చేస్తున్నారు సీఎం జగన్. సీటు నిరాకరిస్తున్న వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావటం కోసమే నిర్ణయాలు తప్పటం లేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం సీఎం నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
11 నియోజకవర్గాల్లో మార్పులు
ఎక్కడైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందో వారిని మార్చుతున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసారు. మరో జాబితా సిద్దంగా ఉంది. అది ఇవాలో లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తుందీ సీఎం వివరిస్తున్నారు. సంక్రాంతి నాటికి అన్ని స్థానాలపై క్లారిటీ ఇచ్చేలా జగన్ పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోనే ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు.
తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు
ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి సీటు విషయంలో ఫోన్లు అందుకున్న నేతలు తాడేపల్లిలో పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఒకసారి ప్రకటన చేస్తే మళ్లీ ఎలాంటి మార్పులు ఉండవనే సంకేతాలు ఇస్తున్నారు. మొత్తంగా ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు సీఎం ముందస్తు వ్యాఖ్యలతో వైసీపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అయితే ఎవరి సీటు ఉంటుంది.. ఎవరి సీటు ఊడుతుంది..? అనే దానిపై క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 11మంది ఇంచార్జ్ లను మార్చిన జగన్... వైసీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు. వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు టికెట్లు ఇచ్చి.. రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఏ యాంగిల్ లోనూ ఓటమి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. టికెట్లు దక్కనివారికి తర్వాత సర్దుబాటు చేస్తామని చెబుతున్న జగన్.. మాట వినకపోతే మీ దారి మీరు చూసుకోవచ్చని చెప్పేస్తున్నారు. ఇలా ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే చెప్పేయడంతో.. ఎవరైనా పార్టీ మారినా పెద్దగా ఇబ్బంది రాకుండా చూసుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన నియోజకవర్గ సమన్వయకర్తలకు కూడా అందర్నీ కలుపుకుపోవాలని ప్రధానంగా చెబుతున్నారు. ఇప్పట్నుంచీ పోలింగ్ రోజు దాకా.. ఓటర్లతో నిరంతరం టచ్ లో ఉండాలని మరీ మరీ చెబుతున్నారు. కొత్తవారు కూడా పాతవారిలాగే ఉంటే.. మార్చడానికి వెనుకాడేది లేదని ముందే చెప్పి మరీ నియామకాలు చేస్తున్నారు జగన్. దీంతో కొత్తవారు పాతవారి కంటే సీరియస్ గా పనిచేస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట ఖచ్చితంగా మార్పు చేయడానికి సిద్ధమయ్యారు. ముందు నుంచే అందుకు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు.