YSRCP Leaders comments on Jagan: ఎన్నికల వేళ YSRCPలో అసంతృప్తి పెరిగిపోతోంది. 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యమంటూ అభ్యర్థుల మార్పులు-చేర్పులు  చేస్తున్నారు సీఎం జగన్‌(CM JAGAN). ఇందులో కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కూడా స్థానచలనం తప్పడం లేదు. కొందరి అసలు టికెట్‌ ఇవ్వడంలేదు. కొందరు ఎమ్మెల్యేలను ఈసారి ఎంపీ స్థానానికి పోటీ చేయించే ఆలోచనలోనూ ఉంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం. అయితే... ఈ మార్పులు చేర్పులతో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఎన్నో అవమానాలు భరించామని.. అయినా న్యాయం జరగడంలేదని ఆరోపిస్తున్నారు. జనసేనలోకి  జంప్‌ అయిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆ తర్వాత అన్నా రాంబాబాబు.. ఇప్పుడు ఎమ్మెల్యే పార్థసారథి. వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానంపై విమర్శలు  గుప్పించారు.


ఇప్పుడు పార్థసారథి వంతు


వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి (MLA Parthasarathi).. ఏకంగా సీఎం జగన్‌పైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ప్రజలు గుర్తించినా.. సీఎం జగన్‌ మాత్రం ఎప్పుడూ గుర్తించలేదంటూ అసహనం వ్యక్తం  చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా నిన్న(గురువారం) రాత్రి సభ  నిర్వహించారు. ఈ సభకు మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. ఆ సభలో పార్థసారథి మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు సీఎం జగన్‌ తనను  గుర్తించకపోయినప్పటికీ.. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను గుర్తించారని చెప్పారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా... నియోజకవర్గ ప్రజలు గుండెల్లో  పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా.. పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు పార్థసారథి. దీంతో వేదికపై ఉన్నజోగి రమేష్‌ కోపంతో  వేదిక దిగి వెళ్లిపోయారు.


అన్నారాంబాబు అసహనం


నిన్న అన్నా రాంబాబు (Anna rambabu)... గిద్దలూరు ఎమ్మెల్యే అయిన ఆయన.. పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య సామాజికవర్గం తనను టార్గెట్‌  చేసిందని... ఆ సామాజికవర్గం తనను చాలా ఇబ్బందులు పెడుతోందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. 34 ఏళ్లుగా  మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని.. మాగుంట ఓటమి కోసం జిల్లా  అంతటా పర్యటిస్తానని అన్నారు అన్నా రాంబాబు. గిద్దలూరు నియోజకవర్గంలో అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా మద్దతిస్తానని అంటూనే... అసహనం బయటపెట్టారు.  ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.


పార్టీ మార్చేసిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ


మొన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ (Vamsi Krishna yadav)ది కూడా ఇదే తీరు. ఆయన వైఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి జనసేన చేశారు. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ సీఎం  జగన్‌కు 11 పేజీల లేఖ రాశారు వంశీకృష్ణ. కష్టపడి పనిచేసినా గుర్తించలేదని... కనీసం మనిషిగా కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేయడం  వెనుక.. ఎంతో ఆవేదన, ఎన్నో అవమానాలు ఉన్నాయని లేఖలో రాశారు. పార్టీ కోసం ఖర్చుపెడితే క్వారీ వ్యాపారాన్ని దెబ్బతీశారని చెప్పుకొచ్చారు. పెద్దిరెడ్డి,  ధనుంజయరెడ్డికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ కాదు కదా... మేయర్‌ పదవి కూడా ఇవ్వకుండా మాయ చేశారని.. సీఎం జగన్‌కు లేఖ  రాశారు వంశీకృష్ణ యాదవ్‌. పార్టీ కోసం శ్రమించినందుకు 25 క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


సొంత పార్టీ నేతల అసంతృప్తి... ఎన్నికల వేళ దెబ్బకొట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండో దఫా మార్పులు చేర్పులపై వైసీపీ అధికార  ప్రకటన వచ్చిన తర్వాత... ఇంకెంత మంది నేతలు ఇలా తమ అసహనం వ్యక్తం చేస్తారామో ఏమో. అయితే... వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు మాత్రం.. అసంతృప్తి నేతలను  పట్టించుకోవాల్సి అవసరం లేదని అంటోంది. ఉంటే ఉండండి... పోతే పోండి అంటూ అసంతృప్తి నేతలకు ఖరాఖండిగా చెప్పేస్తోంది.