Ambati Rambabu News: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ యాంకర్ తరహాలో హాజరు కాబోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మొదట సభకు వస్తానన్న పవన్ కల్యాణ్, మళ్లీ రానని చెప్పారని, ఇప్పుడు వస్తానని చెబుతున్నారని అన్నారు. తనకు చంద్రబాబు నుంచి ప్యాకేజీ అందితే పవన్ కల్యాణ్ సభకు వస్తారని, లేకపోతే రారని ఆరోపించారు. ఇప్పుడు ఆకర్షణీయ ప్యాకేజీ అందింది కాబట్టే.. పవన్ కల్యాణ్ లోకేశ్ సభకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ యాత్రను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి అంబటి తెలిపారు. గతంలో సభలకు జనాలు లేక సినీ యాంకర్ తో సభల్లో ప్రసంగాలు ఇప్పించారంటూ అంబటి ఎగతాళి చేశారు.


ఇప్పుడు యువగళం పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పేందుకు టీడీపీ అష్టకష్టాలు పడుతోందని అన్నారు. అయితే ఈ తరహాలోనే యువగళం ముగింపు సభ కోసం కూడా ఇద్దరు యాంకర్లు ఉన్నారని చెప్పారు. వారిలో ఒకరు బాలకృష్ణ, ఇంకొకరు పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. బంధువు అయిన బాలకృష్ణ ఫ్రీగా యాంకరింగ్ చేస్తే, పవన్ కల్యాణ్ మాత్రం ప్యాకేజీలో భాగంగా నోట్లు - సీట్లు ఆశిస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రను ప్రజలు కేవలం హాస్య యాత్రగానే చూస్తున్నారని అంబటి తెలిపారు.


నారా లోకేశ్‌కు సోదరుడికి, చౌదరుడికి తేడా తెలియదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ను కూడా చౌదరుడు అందటారని అన్నారు. సోదరుడికి, చౌదరుడికి తేడా తెలియని వ్యక్తి లోకేశ్ అని అన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా అందరూ వెళ్లబోతున్నారని అన్నారు. అసలు యువగళం పాదయాత్ర అనేది అట్టర్ ఫ్లాఫ్ అని, అది అశుభాలతోనే ప్రారంభమైందని అన్నారు. ప్యాకేజీ తీసుకొని ఆ సభకు యాంకర్ గా వెళ్తున్న పవన్ కల్యాణ్ ను చూస్తే తనకు జాలిగా ఉందని అన్నారు.


టీడీపీ భారీగా ఏర్పాట్లు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం (డిసెంబరు 18) ముగిసింది. యువగళం చివరిరోజు కావడంతో లోకేష్ తో కలసి ఆయన తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. ఒక్కరోజు బ్రేక్ తీసుకుని, బుధవారం నాడు (డిసెంబర్ 20) విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలో నిర్వహించనున్న లోకేష్ యువగళం విజయోత్సవ సభకు తరలిరానున్న టీడీపీ శ్రేణులకు శుభవార్త చెప్పారు. పలు ప్రాంతాల నుంచి ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని టీడీపీ కల్పించింది.


నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభ డిసెంబర్ 20న నిర్వహించే పనులో టీడీపీ శ్రేణులు బిజీగా ఉన్నాయి. బహిరంగ సభకు 110 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, దాదాపు 5 లక్షల మంది తెలుగు తమ్ముళ్లు సభకు హాజరవుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారని తెలుస్తోంది. యువగళం పాదయాత్ర ముగింపు సభకు నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ కీలక నేతలు జిల్లాల తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చారు.