Jagananna Civil Services Prothsahakam 2023: ఏపీలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు డిసెంబరు 19తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేపోయిన అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది.
దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏడాది నిర్వహించే నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఏపీ నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ సంఖ్యను మరింత పెంచేలా, ఎక్కువ మందిని ప్రోత్సాహించేలా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అభ్యర్థులు అన్ని అవసరమైన ధృవపత్రాలతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పథకం ద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా లభించనుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత పొందినవారికి వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనుంది. డీబీటీ పద్ధతిలో నేరుగా అభ్యర్థుల ఖాతాల్లోనే నగదు జమ చేయనుంది.
ఎన్నిసార్లు అయినా సాయం..
ఈ పథకం కింద అభ్యర్థులు యూపీఎస్‌సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం పొందే వీలుంది. ఈ ప్రోత్సాహకంతో ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందేలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం అందించే ఈ సాయం అభ్యర్థుల కోచింగ్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇతర ఖర్చుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతోంది.
పథకానికి ఎవరు అర్హులు?
♦ సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాలకు చెందినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
♦ ఆంధ్రప్రదేశ్‌లో స్థానికుడై ఉండాలి.
♦ తప్పనిసరిగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. ఈమేరకు రుజువు పత్రాలు సమర్పించాలి.
♦ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్ను వంటి ధృవపత్రం అందించాలి. కుటుంబ వార్షిక ఆదాయాన్ని తాహశీల్దార్ ద్వారా ధృవీకరిస్తారు.
♦ కుటుంబానికి 10 ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి ఉండొచ్చు.
రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లు..
➥ సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోకాపీ
➥ సంతకంతో కూడిన స్కానింగ్ కాపీ
➥ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అడ్మిట్‌కార్డు లేదా రూల్ నెంబరు స్లిప్.
➥ కుటుంబ వార్షిక ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్
➥ నివాస ధృవీకరణ పత్రం
➥ ఆధార్ కార్డు కాపీ, ఆధార్ కార్డు బ్యాంకుతో అనుసంధానమై ఉండాలి.
Print registered Application form
Update registered Application form