ఐపీఎల్‌ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ సందర్భంగా అఫ్గానిస్థాన్‌ ప్లేయర్‌ నవీన్ ఉల్‌ హక్‌... టీమిండియా స్టార్‌ కింగ్‌ కోహ్లీకి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని అభిమానులు ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోరు. కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం గొడవకు కారణమైంది. అది కాస్త పెను దుమారంగా మారింది. ఇందులో మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కూడా తలదూర్చాడు. దాంతో గొడవ మరింత పెద్దదైంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ దగ్గరకు వచ్చిన నవీన్ ఉల్ హక్.. అతనితో మాట్లాడుతూ హగ్ చేసుకున్నాడు. కోహ్లీ సైతం నవ్వుతూ అతన్ని హత్తుకున్నాడు. ఈ చర్యతో ఈ ఇద్దరూ ఆటగాళ్ల మధ్య ఉన్న గొడవకు ఎండ్‌కార్డ్‌ పడింది. ఈ గొడ‌వ నేప‌థ్యంలో నవీన్‌.. కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురైయ్యాడు. ఆ స‌మ‌యంలో అత‌డు సోష‌ల్ మీడియాలో ప‌లు మామిడి పండ్ల ఫోటోల‌ను పోస్ట్ చేయ‌డంతో చాలా మంది అత‌డిని మ్యాంగో మ్యాన్ అని పిలుస్తున్నారు.  అయితే ఇప్పుడు నవీన్‌ ఉల్‌  హక్‌కు భారీ షాక్‌ తగిలింది. 

 

యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 నిర్వాహకులు.. నవీన్‌ ఉల్‌  హక్‌పై 20 నెలల పాటు నిషేధం విధించారు. ఈ నిషేధంతో షార్జా వారియర్స్‌ తరఫున ఆడుతున్న నవీన్‌.. రెండు, మూడో సీజన్‌లకూ దూరమవనున్నాడు. ముందస్తు ఒప్పందంలో భాగంగా.. షార్జా టీమ్‌ నవీన్‌ను రెండో సీజన్‌లో కూడా రిటైన్‌ చేసుకుంది. ఆ మేరకు అతడికి పేపర్లు పంపినా అతడు అగ్రిమెంట్‌ మీద సంతకం చేయలేదు. దీనిపై పలుమార్లు అతడిని సంప్రదించినా నవీన్‌ నుంచి ఏ స్పందనా లేకపోవడంతో షార్జా జట్టు.. అఫ్గాన్‌ పేసర్‌ నిబంధనలను ఉల్లంఘించాడని ఆరోపిస్తూ ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదుచేసింది. దీంతో విచారణ చేపట్టిన డిసిప్లినరీ కమిటీ.. నవీన్‌పై ఐఎల్‌టీ20లో 20 నెలల పాటు నిషేధం విధించింది. తాజా నిషేధంతో అతడు రెండు సీజన్ల పాటు ఈ లీగ్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే ఐఎల్‌టీ20లో మిస్‌ అయినా నవీన్‌ ఇతర లీగ్స్‌లో ఆడొచ్చు. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన నవీన్‌.. తాజాగా క్రమశిక్షణ చర్యల కారణంగా ఐఎల్‌టీ20 నుంచీ తప్పుకోనున్నాడు.

 

ప్రపంచకప్‌లో  అఫ్ఘానిస్థాన్ పోరాటం అద్భుతంగా ముగిసింది. ఎటుచూసినా అంధకారమే ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్‌.. అద్భుత ప్రదర్శన చేసింది అబ్బురపరిచింది. మూడు ప్రపంచ ఛాంపియన్‌ జట్లను చిత్తు చేసి మరో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించినంత పని చేసింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌ అంటే అగ్ర జట్ల కూడా భయపడేలా... సమగ్ర వ్యూహంతో బరిలోకి దిగేలా చేసింది. ఈ వరల్డ్ కప్‌లో సెమీస్‌ చేరేందుకు మిగిలిన నాలుగో బెర్తు కోసం చివరి క్షణం వరకు అఫ్గాన్‌ రేసులో నిలిచిందంటే అర్ధం చేసుకోవచ్చు. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆ జట్టు పోరాటం ఆకట్టుకుంది. ఒకప్పుడు బౌలింగ్‌లో సత్తా చాటి బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓటమి పాలవ్వడం అప్గాన్‌కు సాంప్రదాయంగా ఉండేది. కానీ ఈ వరల్డ్‌కప్‌లో అప్గాన్ బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఓ అఫ్గాన్‌ బ్యాటర్‌ సెంచరీ చేసి సత్తా చాటాడు. అంతేనా ఈ పోరాటాలతో అఫ్గాన్‌ ఇక పసికూన జట్టు కాదని.. అగ్ర జట్టని మాజీ క్రికెటర్లు తీర్మానం చేసేశారు.