Demolition Of Houses In Ippatam: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో రెండో దఫా ఇళ్ళ తొలగింపు ప్రారంభం అయ్యింది. గతంలో కొన్ని ఇళ్ళను తొలగించిన అధికారులు మరోసారి ఇళ్ళను కూల్చేందుకు చర్యలు తీసుకోవటంపై స్దానికులు మండిపడుతున్నారు.


అక్రమంగా తమ ఇళ్ళను తొలగిస్తున్నారంటూ ఇప్పటం గ్రామంలోని స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానికులకు టీడీపీ, జనసేన నేతలు మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి , ఆందోళన చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కావాలని తమపై కక్షతో ఆక్రమణలను తొలగిస్తున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఆక్రమణలను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 


నోటీసులు ఇచ్చిన తరువాతనే ఇంటి ముందు ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నామని, ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని ప్లానింగ్ అధికారి లక్ష్మి దొర మీడియాకు తెలిపారు. అయితే తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని స్థానికులు కొందరు చెబుతున్నారు. ఇంత కాలం లేని అభివృద్ధి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అంటూ బాధితులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటం ఇళ్ళను కొల్పొతున్న బాధిత కుటుంబ సభ్యులు అధికార పార్టీ పై ఆరోపణలు చేస్తున్నారు. 


నగరపాలక సంస్థ పరిధిలోని అనేక చోట్ల అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటిని తొలగించకుండా, అనేక సంవత్సరాలుగా నివాసం ఉండే వారిపై కక్ష పెంచుకుని తొలగిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. డాన్‌బాస్కో ఎదురుగా గతంలో తొలగించిన ఇళ్ళను తిరిగి కొందరు అధికార పార్టీకి చెందిన వారి సహాయ, సహాకారాలతో నూతన నిర్మాణాలు చేసుకున్నారని స్థానికులు అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు అందరూ సహాకరం ఉంటుంది కానీ ఇలా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కచ్చితంగా సమాధానం చెప్పేందుకు సిద్ధం అంటున్నారు. రోడ్డు విస్తరణకు స్థలం అవసరం అయితే, అధికారులు ముందస్తుగా చర్చలు జరిపి చర్యలు తీసుకునే వీలుందని, అయితే ఎటువంటి సమాచారం లేకుండా నిర్మాణాలను తొలగించటంపై మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపి తొలగింపు చేయాలని, స్థానికులు కోరుతున్నారు.


ఇంటి ప్లాన్లను అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారని అధికారులు వాటి కూల్చివేతను చేపట్టారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగరపాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో కూలగొట్టారు. కూల్చివేతలను అడ్డుకొంటూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిరసనల మధ్యే సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. గ్రామ సరిహద్దుల్లో పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చేవారిని తనిఖీ చేసి, వారి వివరాలను నమోదు చేసుకొని గ్రామంలోకి అనుమతిస్తున్నారు.


ఇప్పటానికి జనసేనాని అండ....
ఏపీలో ఇటీవల కాలంలో రాజకీయంగా వేదికగా మారిన గ్రామం ఎదైనా ఉందంటే అది ఇప్పటం గ్రామం మాత్రమే. గుంటూరు జిల్లా పరిదిలోని మంగళగిరి, తాడేపల్లి నగర పాలక సంస్ద పరిధిలో ఉన్న ఈ గ్రామంలోనే ఇటీవలే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవస్థాపక సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. వాస్తవానికి జనసేన వ్యవస్థాపక సభను నిర్వహించేందుకు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో చాలా చోట్ల స్థలాలను జనసేన నాయకులు పరిశీలించారు. అయితే అధికార పార్టీ అడ్డంకులు, అధికారుల బెదిరింపులతో సభ నిర్వహించేందుకు భూమి కూడా దొరకని పరిస్దితుల్లో ఆఖరి నిమిషంలో ఇప్పటం గ్రామంలో జనసేన సభకు భూములు ఇచ్చారు. దాదాపుగా 14ఎకరాల స్దలంలో జనసేనాని పవన్ సభను నిర్వహించారు. 


అదే సభలో పవన్ గ్రామ సంక్షేమం కోసం 50లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆ తరువాత జనసేన నాయకులు ఆ మొత్తాన్ని స్థానిక గ్రామాధికారులకు చెక్ రూపంలో అందించారు. అయితే 50లక్షల రూపాయలు విరాళాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని స్థానిక అధికారులు ఆదేశాలు ఇవ్వటంతో గ్రామస్థులు ఎదురు తిరిగారు. దీంతో స్థానికంగా అధికారులు, అధికార పార్టి నాయకులు, జనసేన నాయకులకు మధ్య వివాదం మొదలైంది. 


ఇప్పుడు మరో సారి....
ఇప్పటం గ్రామంలో ఇళ్ళ తొలగింపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిగిన రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా ఖండించాయి. గత ఎడాది కాలంగా ఈ వ్యవహరం పై రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు మరోసారి జనసేన ఆవిర్బావ సభను మచిలీపట్టణంలో నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే కూడా గతేడాది సభ నిర్వహించిన ఇప్పటం గ్రామం చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది.