KA Paul News: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు తొలుత సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. కానీ, అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించారు. అయినా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్ లో ఉండడంతో ఇప్పుడు కలవలేరని సిబ్బంది తేల్చి చెప్పేశారు. దీంతో ఐదో బ్లాక్ ఎంట్రన్స్ వద్ద మెట్లపై కూర్చుని కేఏ పాల్ నిరసనకు దిగారు. ఎన్నికల విషయమై సీఈఓను కలవడానికి తాను వచ్చానని డాక్టర్ కేఏ పాల్ తెలిపారు.
ఏప్రిల్ లో ఎలక్షన్ ఏంటి? మేలో కౌంటింగ్ ఏంటి? దీనిపై నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను. ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ జరుగుతోంది. నన్ను లోనికి అనుమతించకుండా ఆపేశారు. 747 విమానంలో తిరిగిన నేను ఇప్పుడు ఏపీ ప్రజల కోసం నడుచుకుంటూ వచ్చాను. నేను హైకోర్టులో వేసిన పిటిషన్ లిస్ట్ అయింది. ప్రపంచంలోని 200 దేశాల్లో ఎక్కడైనా ఎన్నికలు జరిగిన 30 లేదా 40 రోజుల తర్వాత కౌంటింగ్ జరుగుతుందా? మన దేశంలోనే జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లాంటి ఉత్తరాధి రాష్ట్రాల్లో ఇలా జరగడం లేదు. ఈ 40 రోజుల్లో ఈవీఎంలు మార్చడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకనే ఎన్నికల కమిషనర్ ని కలవడానికి వచ్చాను. నన్ను అనుమతించడం లేదు’’ అని కేఏ పాల్ మాట్లాడారు.