School Holidays in Telugu States: తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి (మార్చి 8) వరుసగా మూడురోజుల పాటు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి కాగా, మార్చి 9న రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు రెండో శనివారం సెలవు ఉండదు. అలాగే మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవులు రానున్నాయి. 


మహాశివరాత్రిని ప్రతీ సంవత్సరం మూడు రోజులపాటు జరుపుకుంటారు. అయితే ప్రతిసంవత్సరం ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మొదటి రోజు మాత్రమే శివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తాయి. ఈ సారి కూడ మార్చి 8వ తేదీ ఒక్కరోజు సెలవు ప్రకటించినా, ఆ రోజు శుక్రవారం కావడం తర్వాతి రోజు సెకండ్ శనివారం, మరుసటి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలువులు వచ్చాయి.


మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు.. 
మరోవైపు మార్చి 15 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.క్రమంగా ఎండలు పెరుగుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే.. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలోమాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.


ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు?
ఇక ఏపీలో ఒంటిపూట బడులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది పాఠశాలలు ఆలస్యంగా మొదలుకావడం వల్లే.. హాఫ్ డే స్కూల్స్ విషయంలో లేట్ అయిందని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ ఒకరు తెలిపారు. దీనిపై నాలుగైదు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీలోనూ మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే పదోతరగతి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.
పదోతరగతి పరీక్షల హాల్‌‌‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


'మోడల్ స్కూల్స్' దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష-2024 దరఖాస్తు గడువును విద్యాశాఖ అధికారులు మరోసారి పొడిగించారు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభంకాగా.. మార్చి 2 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆ గడువును మార్చి 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.  విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...