Anakapalli News: రానున్న ఎన్నికల్లో పోటీ చేయడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో వైఎస్సార్ చేయూత విడుదల కార్యక్రమంలో సీఎం సమక్షంలోనే మంత్రి అమర్నాథ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో అమర్ ఎక్కడ పోటీ చేస్తారన్నదానిపై ఇప్పటికి స్పష్టత లేకుండా పోయింది. అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని భరత్ కుమార్ కు వైసిపి కేటాయించింది. ఈ క్రమంలో మంత్రి అమర్ పోటీపై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లేకుండా పోవడంతో.. సీఎం జగన్ పాల్గొన్న సభా వేదికగానే అమర్నాథ్ తనకున్న ఇబ్బందులను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటూ చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని అమర్ పేర్కొన్నారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేసిన గుడివాడ అమర్.. జగనన్న ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించేందుకు అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్ తన మీద నమ్మకంతో 15 నియెజికవర్గాల బాధ్యతలను అప్పగించారని, ఈ 15 నియోజకవర్గాలకు డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా తనకు బాధ్యతలను అప్పగించారన్నారు. ఆయా నియెజికవర్గాలను గెలిపించి మళ్లీ జగన్ ను సీఎం చేస్తానని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. 15 నియోజకవర్గాల కార్యకర్తల కోసం తాను పని చేస్తానని, ఇందు కోసం అవసరమైతే పోటీ నుంచి కూడా తప్పుకుంటానని అమర్ వెల్లడించారు. అందరి తలరాతలను దేవుడు రాస్తే, తన తలరాతను మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి రాస్తారని ఈ సందర్భంగా అమరనాథ్ స్పష్టం చేశారు. 


అమర్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం జగన్..


మంత్రి అమర్నాథ్ పోటీ చేయడంపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చేయూత సభా వేదికగానే అమరకు స్పష్టమైన హామీను సీఎం అందించారు. భరత్, అమర్ ఇద్దరు తన తమ్ముళ్ళేనని, వచ్చే ఎన్నికల్లో భరత్ ను ఆశ్వీర్వదించి తోడుగా నిలవాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. మంత్రి అమర్నాధ్ ని తన గుండెల్లో పెట్టుకుంటానని, అమర్ కు మంచి చేస్తానని సీఎం భరోసా ఇచ్చారు. అనకాపల్లికి సంబంధించి అమర్, భరత్ అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటికి కావాల్సిన నిధులు మంజురు చేస్తానని ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 



మంత్రి గుడివాడ అమర్ పోటీ లేనట్టేనా


సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కేడర్ ను అయోమయంలోకి నెట్టాయి. ముఖ్యంగా అమర్నాథ్ అభిమానులను కొంత నిరాశకు గురి చేశాయని చెప్పవచ్చు. అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనప్పటికీ మరోచోట తమ నాయకుడు పోటీ చేస్తాడని ఆయన అభిమానులు చెబుతూ వస్తున్నారు. సీఎం సభ సాక్షిగా తాను పోటీ చేయనని స్వయంగా మంత్రి అమర్నాథ్ చెప్పడంతో క్యాడర్ అయోమయానికి గురైంది. సీఎం జగన్ కూడా తాను అమర్నాథ్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పారే తప్ప.. మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు, మరోచోట పోటీ చేయిస్తానని కూడా చెప్పలేదు. ఇదే ఇప్పుడు అమర్ అనుచరులను ఆందోళనకు గురిచేస్తోంది.