Jangareddigudem Deaths: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న కల్తీ సారా మరణాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాధ్యత వహించాలని ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాలన్నీ వైఎస్ జగన్ చేసిన హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మద్యపాన నిషేధం అని చెప్పి, కొత్త కొత్త బ్రాండ్లను ఏపీకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ఎద్దేవా చేశారు.
నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు నిరసనగా వచ్చారు. నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్వర్యంలో సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి శాసనసభ వరకు మద్యం సీసాలతో వచ్చి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. సీఎం జగన్ మోసం ఖరీదు 25 ప్రాణాలు అని నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ.. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. నకిలీ బ్రాండ్ల బాగోతం బయటకు తీయాలని, జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై విచారణ చేపట్టాలన్నారు. ఇప్పటివరకూ దాదాపు 25 మంది కల్తీ సారా తాగి చనిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చనిపోయి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో తీసుకొచ్చే వింత మద్యం బ్రాండుల వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని ఆరోపించారు.
అసెంబ్లీలో చర్చకు టీడీపీ పట్టు !
జంగారెడ్డి గూడెం మరణాల అంశంపై అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలకు అవకాశం ఇస్తూ, తమకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పైకి ఎక్కి, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టారు. అంతా కాగితాలు చింపి స్పీకర్ పైన వేశారు. దీంతో సభలోకి మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.