జంగారెడ్డి గూడెం వరుస మరణాల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు తెలుగు దేశం పార్టీ సభ్యులు చర్చకు డిమాండ్ చేస్తున్నారు. ఈ గందరగోళం మధ్య సోమవారం సభ ప్రారంభం కాగానే 10 నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి 10 గంటలకు సభ ప్రారంభం అయినా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ, సహా మండలిలోనూ గందరగోళమే ఏర్పడింది. తొలిసారి సభ వాయిదా పడ్డ అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామితో అత్యవసరంగా భేటీ అయ్యారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ లోపల, బయట కూడా జంగారెడ్డి గూడెం వ్యవహారంపై విపక్షాల విమర్శలకు దీటుగా స్పందించాలని నిర్దేశించారు. అనంతరం ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి ప్రారంభం కాగా.. మళ్లీ టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో శాసన మండలి, తర్వాత శాసన సభ కూడా వాయిదా పడ్డాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో సారా రాజకీయం దుమారం రేపుతోంది. జంగారెడ్డి గూడెంలో నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది మరణించారు. అయితే, ఆ సంభవించిన మరణాలని కల్తీ సారా తాగడం వల్ల వచ్చినవని, ప్రతిపక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. కానీ, అధికార వైసీపీ మాత్రం అంతా వివిధ కారణాల వల్ల మరణించారని కొట్టి పడేస్తోంది. 18 మంది నాలుగు రోజుల్లో చనిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
శనివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన ఆళ్ల నాని ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. అసలు అవి సారా మరణాలు కాదని.. టీడీపీ వాళ్లు అలా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. శవరాజకీయాలు చేయడం టీడీపీ నాయకులకు అలవాటే అని మండిపడ్డారు. సారా తయారీపై పోలీసులు ఎస్ఈబీ అధికారులు జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తు్న్నట్లుగా వెల్లడించారు.
ఏది ఏమైనా జంగారెడ్డి గూడెం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించింది. జరిగిన ఘటనపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పడం లేదని.. బాధితుల కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం ప్రకటించకుండా కాలాయాపన చేయడంలో ఆంతర్యం ఏంటని పలు రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. నాలుగు రోజులుగా అన్ని ప్రధాన పార్టీల నాయకులతో పాటు ఆయా పార్టీల అధినేతలు బాధితులను పరామర్శించేందుకు జంగారెడ్డి గూడెం తరలివస్తున్నారు. నేడు (మార్చి 14) చంద్రబాబు కూడా బాధితులను పరామర్శించనున్నారు.