Pawan Kalyan : రేపు(సోమవారం) జనసేన ఆవిర్భావ సభను గుంటూరు జిల్లా మంగళగిరి(Mangalagiri) ఇప్పటం గ్రామంలో నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ సభను ఏర్పాటుచేశారు. సభ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనసేన(Jansena) కార్యకర్తలు తెలిపారు. జనసేన పార్టీ ఎనిమిదేళ్లు పూర్తి చేసికుని తొమ్మిదో ఏట అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. జనసైనికులతో పాటు రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ సభకు ఆహ్వానితులే అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్షేమంగా సభకు వచ్చి విజయవంతం చేయాలని పవన్ కోరారు. 






సభలో అన్నింటికీ సమాధానం చెప్తా 


ఈ సభను జనసేన ఆవిర్భావ దినోత్సవం(Janasena Formation Day)గా చూడటం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశానిర్దేశం చేయబోతుందన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు ఏంచేసింది, ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు సభలో ప్రస్తావిస్తామన్నారు. ఈ సభ వేదికగా జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నామన్నారు. భవిష్యత్తు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తదితర అంశాలపై సభలో మాట్లాడతామన్నారు. చాలా మందికి సందేహాలు ఉన్నాయని, చాలా మంది విమర్శలు కూడా చేశారని, వీటన్నింటికీ ఆవిర్భావ సభలో సమాధానాలు చెబుతున్నామని పవన్ వీడియో తెలిపారు. 



ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా 


తెలుగు ప్రజల ఐక్యత, ఏపీ అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పవన్ కోరారు. జనసేన సభకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టామన్నారు. ఆయన స్ఫూర్తితోనే తన ప్రసంగం కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. హైవేకు దగ్గరగా ఉన్న సభా వేదిక వద్దకు అందరూ క్షేమంగా రావాలని ఆయన కోరారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జనసేన ఆవిర్భావ దినోత్సవం మన హక్కు అని చెప్పండని పవన్ సూచించారు. పోలీసులు కూడా సభకు పూర్తిగా సహకరించాలని వీడియో సందేశంలో పవన్ పేర్కొన్నారు.