AP Assembly: జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) జరుగుతున్న వరుస మరణాల అంశంపై ఏపీ అసెంబ్లీలో (AP Assembly) రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. ఆ అంశంపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారంటూ వారి విమర్శలను దీటుగా తిప్పికొడుతున్నారు. ఐదో రోజు అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని (Kodali Nani) మాట్లాడుతూ.. చంద్రబాబు (Chandrababu) జంగారెడ్డి గూడెం పర్యటన వట్టి నాటకమని అన్నారు. ఎన్టీఆర్ మద్యపానం అమలు చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచారని, బెల్టు షాపులను తిరిగి తెరిపించారని అన్నారు. రాజకీయాల కోసం మద్యాన్ని పెంచి పోషించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చనిపోయిన వారిని చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని, వారి ప్రతి ఒక్కరి ఉసురు చంద్రబాబుకు (Chandrababu) తగులుతుందని అన్నారు. సభ సజావుగా జరగాలంటే టీడీపీ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సహజ మరణాలను కల్తీసారాకు లింకు పెడుతున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు. శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే జోగి రమేశ్ (MLA Jogi Ramesh) వ్యాఖ్యానించారు.


అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాల అంశంపై అధికార వైసీపీ నేతలకు అవకాశం ఇస్తూ, తమకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు (TDP In Assembly) అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు టీడీపీ పక్షనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యులు తమ వద్ద ఉన్న కాగితాలను చింపివేసి స్పీకర్‌పై పడవేశారు.  స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. పైకి ఎక్కి, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టారు. అంతా కాగితాలు చింపి స్పీకర్ పైన వేశారు. దీంతో సభలోకి మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేదా అంటూ నిలదీశారు.


6 వేల స్కూలు మూసి 40 వేల బెల్టు షాపులు తెరిచారు: రోజా (Roja)
‘‘మద్యం మాఫియాతో టీడీపీ కుమ్మక్కు అయింది. చంద్రబాబు బెల్టు షాపులు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. కానీ, 6 వేల స్కూళ్లు మూసేసి 40 వేల బెల్టు షాపులు తెరిచారు. ఎనీ టైం మందు దొరికే తరహాలో పరిపాలించారు. బడి, గుడి అనే తేడా లేకుండా బెల్టు షాపులు పెట్టించారు. ఇంటింటికీ క్వార్టర్ అందించే పరిస్థితి తెచ్చారు’’ అని ఎమ్మెల్యే రోజా మాట్లాడారు.


కాలినడకన అసెంబ్లీ టీడీపీ నేతలు
అంతకుముందు కాలి నడకన అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారంటూ ఆరోపణలు చేశారు. కల్తీ సారా మరణాల్ని సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కొద్దిరోజులుగా జంగారెడ్డి గూడెంలో 25 మంది చనిపోయారని, రాష్ట్రవ్యాప్తంగా కల్తీ సారాకు వందల మంది మృతి చెందారని ఆరోపించారు.