హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఘోరం జరిగింది. వనస్థలిపురంలో స్థానికులు ఓ ఘటనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓ కుక్క బాలుడి తలను నోటితో పట్టుకొని తీసుకెళ్లడం చూసి కంగారు పడిపోయారు. హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలోని సహారా ఎస్టేట్స్‌ రోడ్డులో ఈ దారుణం జరిగింది. గుర్తు తెలియని ఆ బాలుడి తలను చూసి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. వెంటనే డాగ్ స్క్యాడ్, క్లూస్ టీంను రంగలోకి దింపారు. వారు ఆధారాలను సేకరించారు.


ఎల్బీ నగర్‌ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్స్ రోడ్డులో ఓ పాల బూత్‌లో కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని ఓ బాలుడి తలను కుక్క నోట్లో పట్టుకొని వెళ్లడం గమనించాడు. వెంటనే కుక్కను వెంబడించగా, అది ఓ ప్రహరీ గోడ సమీపంలోని పొదల్లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్ - 1 దగ్గర జరిగింది.


బాలుడి తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి ఈ కేసులో విచారణ చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు వెల్లడించారు. ఆ బాలుడికి దాదాపు పదేళ్ల వయస్సు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. అసలు ఆ బాలుడు ఎవరు? బాలుడిని ఎవరైనా హత్య చేశారా? ఆ కుక్కకు బాలుడి తల ఎక్కడ దొరికింది? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. శిశువు తలను కుక్క ఎక్కడ నుంచి తెచ్చింది అనే విషయంపై సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని పరిశీలించి, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.