Andhra Pradesh CM: ఉదయం పది గంటలకు విజయవాడలో తెలుగుదేశం శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం గవర్నర్‌తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా కోరనున్నారు. 


ఇవాళ జరిగే కూటమి సమావేశంలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదిస్తారు. దీన్ని బీజేపీ ఎమ్మల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు బలపరుస్తారు. అనంతరం అందరూ సంతకాలు చేసిన ధృవీకరణ పత్రాన్ని తీసుకొని వెళ్లి గవర్నర్‌కు అందజేస్తారు. అనంతరం జరగాల్సిన ప్రక్రియను ఆయన ప్రారంభిస్తారు. 


ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న పవన్ 
ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశానికి ముందు జనసేన తరఫున విజయం సాధించిన 21 మంది ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మంత్రివర్గం కూర్పు, కూటమి ప్రభుత్వంలో చేపట్టాల్సిన పాత్రపై వారితో చర్చిస్తారు. ఈ మధ్య కాలంలో ఢీల్లీ జరిగిన పరిణామాలపై కూడా మాట్లాడనున్నారు. మంత్రిగా ఎవరిని ఎంపిక చేసినా మిగతా వాళ్లు ఇబ్బందిగా ఫీల్ కావద్దని... భవిష్యత్‌లో అందరికీ ప్రాధాన్యత వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. 


మరోవైపు ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. గంలో ఎప్పుడూ చూడని విధంగా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా నేతలంతా తరలి వస్తున్న కార్యక్రమంలో భద్రతా వైఫల్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఓసారి దీనిపై ట్రయల్ రన్‌ కూడా నిర్వహించారు.