Home Minister Taneti Vanitha on Gang Rape Incidents: ఏపీలో వరుసగా జరుగుతున్న అత్యాచార నేరాల నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విశాఖపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన తానేటి వనిత ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల సంరక్షణ బాధ్యత పూర్తిగా తల్లిదేనని, ఆ పాత్ర సరిగా లేనప్పుడే ఇలాంటి అత్యాచారాల లాంటివి జరుగుతాయని ఆమె మాట్లాడారు. తండ్రి తన ఉద్యోగ వ్యాపారాల పని మీద బయటకు వెళ్లినప్పుడు సాధారణంగా బిడ్డల పెంపకం బాధ్యతను తల్లి చూసుకుంటుందని, ఆమె కూడా ఏ ఉద్యోగం కోసమో లేక కూలీ పనుల కోసమో బయటకు వెళ్తే పిల్లలను ఇంట్లో చూసుకోవడానికి ఎవరూ ఉండడం లేదని అన్నారు. దీనిని అలుసుగా తీసుకుని ఇరుగు పొరుగువారు, బంధువులు, కొన్నిచోట్ల తండ్రులే పిల్లలపై ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
విజయమ్మ అలా పెంచడమే తప్పా?
అయితే, తానేటి వనిత చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ‘‘మహిళలపై అఘాయిత్యాలు ఆపడం చేతకాక అండగా నిలబడిన వారికి నోటీసులు, హత్యాచారంకు గురైన మహిళకు అక్రమసంబంధం అంటగట్టారు. ఇప్పుడేమో ఏకంగా తల్లులను తప్పు పడుతున్నారు. రేపు తల్లులే చేయిస్తున్నారు అంటారా? అంటే విజయమ్మ బాగా పెంచి ఉంటే జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో వుండేవాడు కాదని మీ అభిప్రాయమా?’’ అని వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.
నిందితులకు శిక్ష పడేదాకా వదలం - మంత్రి విడదల రజిని
రేపల్లె రైల్వే స్టేషన్‌లో గ్యాంగ్ రేప్ ఘటన బాధాకరమని మంత్రి విడదల రజిని అన్నారు. అత్యాచార ఘటనపై సీఎం సీరియస్ అయ్యారని అన్నారు. నిందితులను కఠిన శిక్ష పడే వరకు వదిలిపెట్టబోమని చెప్పారు. ఇప్పటికే ముగ్గురిని పట్టుకున్నామని, ఘటనపై జిల్లా ఎస్పీ, ఆస్పత్రి అధికారులతో మాట్లాడామన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ఆదేశించినట్లు చెప్పారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు మంత్రి విడదల రజిని వివరించారు. బాధిత మహిళకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రజిని చెప్పారు.