Guntur Crime News: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, కీచకులకు శిక్షలు అమలు చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. గత కొన్ని రోజులుగా ఏపీలో బాలికలు, మ‌హిళ‌లపై జరుగులున్న వ‌రుస అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో మ‌రో దారుణం వెలుగు చూసింది. బాపట్ల రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జ‌రిగింది. భ‌ర్త, పిల్ల‌లు పక్కన ఉండ‌గానే, ఆమెను బ‌ల‌వంతంగా పక్కకు లాక్కెళ్లి మ‌రి కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి మేరుగు నాగార్జున (AP Minister Merugu Nagarjuna) అన్నారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను ఆయన పరామర్శించారు.


అర్ద‌రాత్రి స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న సంచ‌ల‌నం రేకెత్తించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో జరిగిన నాలుగో ఘటన ఇది. తెనాలి నుంచి ట్రైన్ లో  రాత్రి 11 గం లకు రేపల్లెకి భర్త ముగ్గురు పిల్లలతో బాధిత మ‌హిళ చేరుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నాగాయలంకకు  కూలి పనుల కోసం కుటుంబంతో వెళ్తున్న బాధితురాలు, అర్ధరాత్రి కావడంతో రైల్వే స్టేషన్ ప్లాట్ పారం పైనే నిద్రించారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్లాట్ ఫాంపైన ఉన్న బెంచీలపైన వారు నిద్రించారు.


అర్ధరాత్రి 12:00 గంటల తర్వాత ముగ్గురు వ్య‌క్తులు నిద్రిస్తున్న మహిళను  బ‌ల‌వ‌ంతంగా ప్లాట్ ఫారమ్ చివరకు లాక్కెళ్లారు. భార్యను ఎవరో తీసుకెళ్తున్నారని అడ్డుకోబోయిన భర్తపై నిందితులు దాడికి పాల్పడి అతడ్ని కొట్టారు. బాధితురాలి భర్తను కొట్టి మరీ నిందితులు ఆ వివాహితపై సామూహిక అత్యాచారం చేశారు. మహిళ ప్రతిఘటించడంతో దాడి చేసి ఆమెను సైతం గాయ‌ప‌రిచారు కామాంధులు. 


ఆర్పీఎఫ్ పోలీసులు స్పందించింటే.. ! 
బాధితురాలి భర్త రైల్వే స్టేషన్‌లోని ఆర్‌పీఎఫ్ స్టేషన్ తలుపులు కొట్టి, కేకలు వేసినప్పటికీ తలుపులు తీయలేదని ఆరోపించారు. ఆర్పీఎఫ్ పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని తోటి ప్ర‌యాణికులు ఆరోపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు కలిసి తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపారు. గంజాయి మత్తులో నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డార‌ని పోలీసులు ప్రాథమికంగా బావిస్తున్నారు. ఘటనా స్థలిలో బాధితుల నుంచి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. బాధితురాలు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుస అఘాయిత్యాలు..
శనివారం అర్ధరాత్రికి వివాహితపై సామూహిక అత్యాచారం ఈ ఏప్రిల్ నెలలో జరిగిన నాలుగో దారుణ ఘటన. కాగా, ఏప్రిల్ 16న గుర‌జాల రైల్వే స్టేష‌న్‌లో ఒడిషా మ‌హిళపై గ్యాంగ్ రేప్ జ‌రగడం సంచలనంగా మారింది. మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగిక దాడులు జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం అరికట్టలేకపోతోందని ప్రతిపక్షం విమర్శించింది. అంతలోనే ఏప్రిల్ 27న చిలుమూరు పొలంలో రూప‌శ్రీ హ‌త్య జ‌రిగింది. ఏప్రిల్ 28న దుగ్గిరాల‌లో తిరుప‌త‌మ్మపై అఘాయిత్యం జ‌రిగింది. మ‌హిళా కూలీపై అమానుషం చోటుచేసుకుంది. తాజాగా రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో సామూహిక అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. మ‌ద్యం, గంజాయి సేవించిన త‌రువాత మందుబాబులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా అర్ధరాత్రి స‌మ‌యంలో మ‌హిళ‌లు, బాలికలు ఒంటరిగా క‌నిపిస్తే చాలు కీచకులు దారుణాలకు పాల్పడుతున్నారు.


బాధితులకు పరామర్శ.. 
రేపల్లె రైల్వేస్టేషన్ లో అత్యాచారానికి గురైన బాధితురాలు, ఆమె భర్తను మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ కుమారుడు మోపిదేవి రాజీవ్ ప్రభుత్వ హాస్పటల్ లో  పరామర్శించారు. పోలీసులను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి మేరుగు. తన తండ్రి మోపిదేవి వెంకట‌రమణ తరుపున బాధిత కుటుంబానికి రూ.50 వేలు అందించారు మోపిదేవి రాజీవ్.


Also Read: Repalle Gang Rape: రేపల్లె రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్ రేప్, భర్తను కొట్టి మహిళను లాక్కెళ్లి ప్లాట్‌ఫాంపైనే ఘోరం