Free Gas Cylinder Apply Online: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మరో కీలకమైన పథకాన్ని ఈ దీపావళి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది. ఏటా మూడు సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని అమలు చేసేందేకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 


తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత సిండర్ల పథకానికి అర్హులు అవుతారు. అలాంటి వారి వద్ద ఒక ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి. వాళ్లకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన ఉండాలి. 


ఉచిత గ్యాస్ సిలిండర్‌లో భాగంగా బుకింగ్స్‌ను ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి రోజున అన్ని ఇళ్లకు సిలిండర్‌ను సరఫరా చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో డెలివరీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బుకింగ్‌తోపాటు డెలివరీ మధ్య 48 గంటల గ్యాప్ ఇచ్చారు. 


బుక్ చేసిన వెంటనే ఆయా మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. గ్యాస్ ఎప్పుడు డెలివరీ అవుతుందో కూడా వివరిస్తారు.గ్యాస్ డెలివరీ అయిన 48 గంటల్లోనే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. మొదటి సిలిండర్ మార్చి 31లోపు రెండోది జులై 31లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఇంకా దీనిపై అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా ఫిర్యాదులు చేయవచ్చు. 


ఉచిత సిలిండర్లు అంటే ముందుగా వినియోగదారుల నుంచి ఆయిల్ కంపెనీ వాళ్లు డబ్బులు తీసుకుంటారు. వినియోగదారులకు ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుంది. అంటే ముందుగా సిలిండర్ డెలవరీ టైంలో గ్యాస్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ పథకాన్ని వర్తింపజేస్తారు.


రాష్ట్రంలో ఉన్న 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో 9.65 లక్షల గ్యాస్ కనెక్షన్లే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో తీసుకున్నవిగా తేల్చారు. ఈ పథకం కోసం ఏటా రూ.2,684.75 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు విషయంలో మూడు ఆయిల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వాళ్లకు అడ్వాన్సుగా రూ.894.92 కోట్లు మూడు రోజుల్లో చెల్లించనుంది.