Free Bus Scheme in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలకమైన పథకాల అమలు చేయాలని ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతున్న తీరుపై అధ్యయనం మాత్రం చేపట్టింది. 

Continues below advertisement


ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని ఆర్థిక వెసులుబాటును బట్టి కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్లు పెంచి ఇస్తున్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలను వేగవంతం చేశారు. తెలంగాణ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో ఈ మహిళలకు ఉచిత బస్ పథకం అమలు అవుతున్న తీరుపై అధ్యయనం చేశారు. మంత్రులు, అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడ పథకం అమలు తీరు ప్రజలను, అధికారులను, మంత్రులను అడిగి తెలుసుకున్నారు. 



ఈ పథకాన్ని మార్చి 8న మహిళా దినోత్సవం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పటికి కూడా ప్రక్రియ మొదలు కాకుంటే కొన్ని విషయాలపై క్లారిటీ రాకుంటే ఉగాది నుంచి ప్రారంభించాలని కూడా యోచిస్తున్నారు.  దీనిపై ప్రభుత్వం శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో క్లారిటీ ఇవ్వబోతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశంకానుంది. ఈ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతోపాటు మరికొన్ని సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. అమలు తేదీలను ప్రకటించనున్నారు. 


మూడు రాష్ట్రాల్లో అధ్యయనం


ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యంటించిన రాష్ట్ర బృందం సమగ్ర నివేదికను రూపొందించారు. అయితే ఉచిత బస్‌ పథకం అమలు చేస్తే ఏపీఎస్‌ఆర్టీసీపై భారం పడుతుందని దాన్ని ఎలా భరించాలనే విషయంపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వమే APSRTCకి ఇవ్వాలి. ఇది రాష్ట్ర బడ్జెట్‌పై భారం మోపనున్నాయి. వీటికి తోడు ఎక్కువ మంది మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే ఛాన్స్ ఉన్నందున ఇప్పుడున్న బస్‌లు సరిపోవు. అందుకే అదనంగా బస్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని కూడా నియమించుకోవాలి. 


Also Read: టీడీపీ, జనసేనకు బుల్లి రాజు ప్రచారం... వెంకీ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల హల్‌చల్


అధ్యయనం చేసింది వీళ్లే


ఇలాంటి సమస్యలను ఎలా టాకిల్ చేయాలనే విషయంపై ఏపీ రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు అనిత, సంధ్య, ఆర్థిక కార్యదర్శి రోనాల్డ్ రాస్, రవాణా, రోడ్లు, భవనాల ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులతో కూడిన బృందం కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణలో తిరిగింది. 


ఈ పథకం అమలు కోసం ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక బస్‌లు కొనుగోలు చేశారు. అదనంగా సిబ్బందిని కూడా నియమించారు. పథకం ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యలు గురించి అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు ఏపీ బృందానికి వివరించారు. సవాళ్లు అధిగమించేందుకు చేపట్టిన చర్యలు కూడా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం కాని అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్పొరేషన్ వద్ద దాదాపు 11,200 బస్సులు ఉంటే అందులో 25 శాతం బస్సులే ప్రీమియం కేటగిరి కిందకు వస్తాయి. 


రూ. 277 కోట్లకుపైగా భారం 


ఈ కొత్త పథకం ద్వారా రోజుకు దాదాపు 20 లక్షల మందికిపైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని వలన ప్రభుత్వంపై నెలకు రూ. 277 కోట్ల అదనపు భారం పడుతుందని లెక్కలు కడుతున్నారు. అటు ప్రయాణికులపై భారం పడకుండా ఉన్న నిధుల్లోనే వీటిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉచిత ప్రయాణ భారాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది. నష్టాలు పూడ్చుకునేందుకు బస్సు ఛార్జీలను 15% పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే ఇప్పటికే ఏపీలో బస్‌ ఛార్జీలు అధికంగా ఉన్నందున ఛార్జీల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. 


Also Read: సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి