పరువునష్టం దావా కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు లీగల్‌ నోటీసులు పంపారు. విజయసాయితో పాటు జగతి పబ్లికేషన్స్‌ ఎండీ సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి టీవీ ఈడీ వినయ్‌ మహేశ్వరి, సాక్షి పత్రిక ఎడిటర్‌ మురళి, ప్రింటర్‌-పబ్లిషర్‌ రామచంద్రమూర్తికి ఏబీ వెంకటేశ్వరరావు నోటీసులు ఇచ్చారు. వీరందరికీ ఏబీవీ జూలై 19న పరువునష్టం దావా నోటీసులు పంపారు. ఎన్నికల్లో రూ.50 కోట్ల తరలింపునకు ఎస్కార్ట్‌ ఇచ్చారనే ఆరోపణపై ఏబీవీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రూ.కోటి పరువునష్టం దావా కేసు వేస్తానని నోటీసుల్లో తెలిపారు.


2019 ఎన్నికల సమయంలో రూ. 50 కోట్ల తరలింపునకు ఎస్కార్ట్ ఇచ్చారనే ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. లేదంటే కోటి రూపాయాలు పరువు నష్టం దావా వేస్తానని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఏబీవీ వర్సెస్ వైసీపీ టీడీపీ ప్రభుత్వ సమయంలో ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును జైలుకు పంపేందుకు ఈ ఒక్క కేసు చాలని గతంలో విజయసాయిరెడ్డి ఆరోపించారు. అప్పట్లో వీటికి సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అవి బయపడతాయని చెప్పారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.


అప్పట్లో ఈ-ప్రగతితో తమ కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయని విజయసాయి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన కుటుంబ సభ్యులకు వాటితో ఎలాంటి సంబంధం లేదని.. నిరాధార ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని గతంలో ప్రకటించారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేసిందని, ఈ మేరకు ఓ జీవోను జారీ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఏబీవీపై ఉన్న ఆరోపణలు అన్నింటినీ ప్రత్యేకంగా కేంద్రానికి పంపినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేశారు. అంతకు ముందు నుంచే ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలపై ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఈ విషయం సుప్రీంకోర్టులో ఉంది.