టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై అధికార విపక్ష నేతల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతూ ఉంది. తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు దీనిపై స్పందించారు. పేదలకు అన్నం పెట్టేందుకు కుప్పంలో అన్న క్యాంటిన్‌ పెడితే, దాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు సహించలేక మూకగా ఏర్పడి దాన్ని ధ్వంసం చేయడం అన్యాయమని అన్నారు. ఆదివారం వైఎస్ఆర్ సీపీ నేతలపై విమర్శలు చేస్తూ అయ్యన్న పాత్రుడు ఒక వీడియోను విడుదల చేశారు. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు ఆటంకం కలిగించడం దారుణమని అభిప్రాయపడ్డారు. 


రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలిపితే ముఖ్యమంత్రి జగన్‌ కడపకు పారిపోతారని ఎద్దేవా చేశారు. కుప్పం గొడవ సమయంలో కొందరు స్థానిక పోలసులు కొందరు మఫ్టీలో వచ్చి జనాల్లో కలిసిపోయి వైఎస్ఆర్ సీపీ నాయకులకు వారికి సహకరించారని ఆరోపించారు. మరోవైపు, మంత్రి పెద్దిరెడ్డి పైన కూడా అయ్యన్న పాత్రుడు విమర్శలు చేశారు. ఆయన పోలీసులకు ఏం చెబితే అది కుప్పంలో జరుగుతోందని విమర్శించారు.


మంత్రి పెద్దిరెడ్డికి, ఇతర వైఎస్ఆర్ సీపీ లీడర్లకు సైతం ఐఏఏఎస్‌ అధికారులు వారికే సలాం చేయాల్సి వస్తోందని అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, విధ్వంసం చేసిన వారిని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపారని వెంగళరావును సీఐడీ అధికారులు అన్యాయంగా వేధించారని అన్నారు. ‘‘వెంగళరావును తీవ్రంగా చిత్రహింసలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు, సీఐడీలపై ఆధారపడి ప్రభుత్వం పనిచేస్తోంది. జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి అసెంబ్లీకి 600 మంది పోలీసులు ఉంటే కానీ యబటికి రాలేరు. 


గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు వైఎస్ఆర్ సీపీ నాయకులపై ఎలా తిరుగుబాటు చేస్తున్నారో చూస్తున్నాం. ప్రశాంత్‌ కిషోర్‌ సర్వేల్లోనూ రాబోయే ఎన్నికల్లో జగన్‌ గెలవరని తేలింది. దీంతో పోలీసులు, సీఐడీని అడ్డం పెట్టుకొని ఓటింగ్‌ జరపాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ వాళ్లు ఎన్ని అరాచకాలు చేసినా టీడీపీ కార్యకర్తలు భయపడరు. మా బలం ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది’’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు.