Andhra Pradesh Teachers Transfers : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడిగా నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం తాజా మాజీ మంత్రి మెడకు చుట్టుకుంటోంది. ఈ బదిలీలకు సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తమ దగ్గర డబ్బులు తీసుకుని కూడా బదిలీలు చేయడం లేదన్న విమర్శలను ఉపాధ్యాయులు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి.  విద్యా శాఖలో ఈ బదిలీలకు సంబంధించిన సిఫార్సులు, పైరవీలకు భారీ మొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఈ దందా వెనుక మాజీ మంత్రి పేషీతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది హస్తం ఉన్నట్లు కూటమి నాయకులు భావించారు. అందుకే విద్యాశాఖ కమిషనర్‌తో మాట్లాడి బదిలీలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయవద్దని ఆదేశాలు ఇప్పించారు. ఉపాధ్యాయుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన  వ్యక్తులు అధికారులు కలిసి ఎన్నికలకు ముందు హడావిడిగా ఈ బదిలీలు చేపట్టారని అంటున్నారు. వీటిపై అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి.


బదిలీలు ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారాన్ని అందించారని టాక్ నడుస్తోంది.విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజు పాత పాఠశాలలలో రిలీవ్ అయి, కొత్త బడుల్లో చేరాలని మొదట ఆదేశాలు ఇచ్చారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ గురువారంతో ముగిసింది. దీంతో ఉపాధ్యాయులు కొత్త బడుల్లో చేరే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. రాజకీయ సిఫార్సు బదిలీలకు ఒక్కో ఉపాధ్యాయుడు మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరంతా ఆందోళన చెందుతున్నారు. డబ్బులు పోయి బదిలీలు జరగకపోవడంతో వీరంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు బాధిత ఉపాధ్యాయ సంఘం తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. 


50 కోట్లకు పైగా స్కామ్ ఆరోపణలు 


ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఒక్కో ఉపాధ్యాయుడు భారీగానే సమర్పించుకున్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 50 కోట్లకు పైగా స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పటి మంత్రి కార్యాలయం కేంద్రంగానే వసూళ్ల పర్వం కొనసాగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో టీచర్ల బదిలీల వ్యవహారం ఆ సీనియర్‌ మెడకు చుట్టుకుంటుంది. ఈ కార్యాలయంలో పని చేసిన సిబ్బంది ఈ ముడుపుల వ్యవహారంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి.


ఈ అక్రమ బదిలీలు వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖలో పెద్దగా భావించే వ్యక్తి జోక్యం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈ ముడుపుల వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అన్నది బయటకు రానుంది. దీనిపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఉపాధ్యాయులు తాము డబ్బులు ఇచ్చిన మంత్రి పేరును కూడా బహిరంగనే చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


ఏది ఏమైనా తమను బదిలీ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బదిలీలను పూర్తిగా నిలిపివేస్తారా..? బదిలీలపై విచారణను నిర్వహిస్తారా.? అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనా హడావిడిగా నిర్వహించిన బదిలీల వల్ల ఇప్పుడు వందలాది మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.