Andhra Pradesh News: ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన(C.S) కార్యదర్శిగా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌(Neerabh Kumar Prasad)ను నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎస్‌ జవహర్‌రెడ్డి(Jawahar Reddy) సెలవుపై వెళ్లిపోగా...ఆయన స్థానంలో నీరబ్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. 

 

ఏపీలో ప్రభుత్వం మారడంతో ప్రభుత్వ అధికారుల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఆడించినట్టు ఆడారని కొందరు అధికారులను కనీసం కలిసేందుకు కూడా చంద్రబాబు(Chandra Babu) నిరాకరిస్తున్నారు.  ఈనేపథ్యంలో జగన్‌(Jagan)కు అత్యంత సన్నిహితంగా మెలిగిన సీఎస్ జవహర్‌రెడ్డి(Jawahar Reddy) స్థానంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. జగన్‌ హయాంలో నీరబ్‌కుమార్(Neerabh Kumar Prasad) ఇన్‌ఛార్జి సీఎస్‌గా  కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు ఉన్న అధికారుల్లో సీనియారిటీ ప్రకారం నీరబ్‌కుమార్‌కే అవకాశం దక్కనుంది.

 

1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్‌ ప్రస్తుతం ఆయన అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీ కేడర్‌కే చెందిన ఆయన పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. అయితే నీరబ్‌కుమార్‌ ఈనెలాఖరుకు పదవీవిరమణ చేయనున్నారు. చివరిలో అత్యుత్తమ పదవిలో ఉండి పదవీవిరమణ చేసే అవకాశం కల్పించాలని నీరబ్‌కుమార్‌ చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఆయన కూడా సానుకూలంగా  హామీ ఇచ్చినట్లు సమాచారం. ..

 

కేవలం 20 రోజుల కోసమే కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ను నియమించడం ఎందుకని చంద్రబాబు భావిస్తే....ఆయన తర్వాత సీనియారిటీ ప్రకారం ఇందనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న విజయానంద్‌(Vijayanadh) ముందు వరుసలో ఉన్నారు. పది, 20 రోజుల కోసం సీఎస్‌లను మార్చడం ఎందుకని...పూర్తిస్థాయిలో ఒకేసారి కొత్త సీఎస్‌(C.S)ను నియమించాలని చంద్రబాబు అనుకుంటే విజయానంద్‌ను సీఎస్‌ పదవి వరించనుంది. వైసీపీ ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా వ్యవహరించిన ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆదేశించడంతో ఆయన గురువారమే సెలవుపెట్టి వెళ్లిపోయారు. దీంతో నేడు కొత్త సీఎస్‌ నియామకంపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.

 

ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర(Muddada Ravichandra)ను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. గురువారం మర్యాదపూర్వకంగా చంద్రబాబును రవిచంద్రను కలిసిన సందర్భంగా... సీఎంవోలోకి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. దీనికి రవిచంద్ర సైతం అంగీకరించడంతో ఆయన్ను సీఎం ముఖ్యకార్యదర్శింగా నియమించినట్లు తెలిసింది. శనివారం లేదా ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వంతో క్లోజ్‌గా ఉన్న అధికారులు, సిబ్బందిని పూర్తిగా మార్చివేయనున్నారు. ఇన్నాళ్లు ఇష్టానుసారం వ్యవహరించి ఇప్పుడు తప్పించుకునేందుకు యత్నిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకే ఉన్నతాధికారులు ఎవ్వరికీ సెలవులు మంజూరు చేయవద్దని ఆయన గట్టిగా ఆదేశించారు. అటు మంత్రుల పేషీలో పనిచేసిన పీఏలు, పీఎస్‌లు ఇతర ఉద్యోగులను మాతృసంస్థకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ప్రభుత్వ సలహాదారులు 40 మందిని తొలగిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంవోతో సహా ముఖ్యమైన కార్యాలయాల్లో ఉన్నతాధికారులు మారనున్నారు. చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు మళ్లీ వెలుగులోకి రానున్నారు.