Diamond Hunt: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ శివారు పొలాల్లో స్థానికులు వజ్రాల వేట సాగిస్తున్నారు. పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయన్న పుకార్లతో స్థానికులు ఎగబడి వజ్రాల కోసం గాలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫ్లాట్ల్ కోసం పోసిన ఎర్రమట్టిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ పుకార్ల చక్కర్లు కొట్టాయి. దీంతో చుట్ట పక్కన గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వచ్చి వజ్రాల కోసం గాలిస్తున్నారు. కొందరు అయితే ఏకంగా వజ్రాల టెస్టింగ్ మిషన్లతో వచ్చి మరీ డైమండ్ల కోసం వేట మొదలుపెట్టారు. వజ్రాల అన్వేషకులు ఏరిన రాళ్లను అక్కడికక్కడే టెస్టింగ్ చేసి నిజమైన వజ్రాలా.. కాదా అనేది తేల్చి చెబుతున్నారు. సత్తెనపల్లి చుట్టుపక్కన ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన స్థానికులు పొలాల్లో వజ్రాల వేట సాగిస్తుండటం గమనార్హం. 


రాయలసీమలోని ఆ జిల్లాల్లో సాగుతున్న వజ్రాల వేట


రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలో రైతులు, ప్రజలు వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు. ఈ సీజన్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో అని ఆశగా వజ్రాల కోసం వెతుకులాడుతున్నారు. అనంతరపురం, కర్నూలు జిల్లాలలో ప్రజలు పిల్లాపాపలతో కలిసి వజ్రాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు వైఎస్సార్ జిల్లా, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇక్కడ వజ్రాన్వేషణ సాగిస్తారు. ఒక్కొక్క పొలంలో 20 నుంచి 30 మంది వజ్రాల కోసం అన్వేషిస్తారు. ఒకవేళ వజ్రం దొరికితే వాటిని కొనుగోలు చేయడానికి వజ్రాల వ్యాపారులు కూడా అక్కడి చేరుకుని సిద్ధంగా ఉంటారు. ఈ రెండు జిల్లాల్లో వజ్రాల కోసం అన్వేషణ ప్రతి సంవత్సరం జరిగే తంతే.


కడపలో వజ్రాల గనులు - తేల్చి చెప్పిన బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా


వైఎస్ఆర్ కడప జిల్లాలో వజ్రాల గనులు ఉన్నట్లుగా  జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ  విభాగం దేశవ్యాప్తంగా కొత్త గనులపై సర్వే నిర్వహించింది. జీ-4 స్థాయి అంటే ప్రాథమిక అంచనా సర్వే నిర్వహించి దాదాపుగా వంద చోట్ల వివిధ రకాల గనులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా ఎక్కువగా ఉంది. ఏపీలో పలు చోట్ల అత్యంత విలువైన గనులు ఉన్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా కడప జిల్లాలో వజ్రాలు లభించే ప్రాంతాలు ఉన్నట్లుగా నివేదికలను ఏపీ ప్రభుత్వానికి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇచ్చింది. 






కడప జిల్లాలో 37 కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యత 


కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు నివేదికలో తెలిపింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాకాలం ప్రారంభమైతే పెద్ద ఎత్తున పొలాల్లో ప్రజలు వెదుకులాట ప్రారంభిస్తారు. ఆ ప్రాంతాలలోఅధిక భాగం ఎర్ర నేలలున్నాయి. రంగురాళ్లు కలిగిన ఈ ఎర్రనేలల్లో తొలకరి చినుకులు కురిసిన తరవాత వజ్రాలు దొరుకుతాయన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. పలుమార్లు దొరికాయి కూడా. ఈ కారణంగా తొలకరి వచ్చినప్పుడు వేలల్లో జనం ఆ ఎర్రనేలల వద్దకు వెళ్తారు. రంగురాళ్లను వెదుకుతారు.రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని ఎప్పటి నుంచో నివేదికలు ఉన్నాయి.  కార్బన్ ధాతువులు భూమి అడుగున అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడికి లోనైనప్పుడు గట్టిపడి వజ్రాలుగా మారతాయి. ఈ ప్రక్రియ భూఉపరితలం నుంచి 140 నుంచి 190 కిలోమీటర్ల దిగువన జరుగుతుంది. అంతకంటే దిగువన మాగ్మా ప్రవహిస్తుంటుంది. దీనినే లావా అని కూడా అంటారు. అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ఆ లావా ఒకోసారి అత్యంత వేగంగా పైపు ఆకారంలో భూఉపరితలానికి చేరి విస్ఫోటనం చెందుతుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు లభించే కింబర్లైట్ పైపులు భూఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయని ఆర్కియాలజీ నిపుణులు చెబుతున్నారు.