బెజవాడ రాజకీయం ఆసక్తిగా మారింది. తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేక రాజకీయం నడుస్తోంది. వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ అభ్యర్థులు ఎవరనే విషయంతో విజయం డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పటికే వైసీపీ తరుఫున దేవినేని అవినాష్‌ అభ్యర్థిగా దాదాపు ఖరారు అయింది. అయితే టీడీపీ అభ్యర్థి ఎవరు అనేదాని బట్టి అవినాష్ భవిష్యత్ తేలనుంది. 


విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గ సీట్ వ్యవహారం తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారింది. ఈ సీటు ప్రభావం విజయవాడలోని మూడు నియోజకవర్గాలపై కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తెలగు దేశం పార్టీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా గాలి వీచినప్పటికి విజయవాడ తూర్పులో మాత్రం, గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. దీంతో రాజకీయంగా ఈ వ్యవహరం సంచలనంగా మారింది. గద్దె రామ్మోహన్‌కు ఉన్న ఆదరణ, తెలుగు దేశం పార్టీ బలం, వీటన్నింటికి మించి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 


మారిన రాజకీయ ముఖ చిత్రం..
ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. తెలుగు దేశం పార్టీ విజయవాడలో గెలుపొందిన ఏకైక సీటును ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అభ్యర్దిని కూడా ఖరారు చేసింది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడు, దేవినేని అవినాష్‌ను అభ్యర్దిగా జగన్ స్వయంగా ప్రకటించారు. దీంతో పోటీపై క్లారిటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో గద్దె రామ్మోహన్ వంటి సీనియర్ నేతను ఢీ కొట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నుంచి దేవినేని అవినాష్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.


పార్టీ మారిన అవినాష్..
2019 ఎన్నికల సమయంలో దేవినేని అవినాష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నుంచి తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని చేతిలో అవినాష్ ఓటమి పాలయ్యారు. అయితే ఆ తరువాత , అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ తరువాత ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.


గెలుపుపై పొలిటికల్ అంచనాలు
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ బలంగా ఉంది. ఇందుకు కారణం ఓ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటమే. దీనికి తోడుగా ప్రస్తుత శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్‌కు పాలిటిక్స్‌లో మంచి పేరు ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెండు ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు పడవనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఉంది.


ఆ ఒక్కటే కీలకం
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్‌ను గన్నవరం నియోజకవర్గానికి మారుస్తారని టాక్ నడుస్తోంది. అక్కడ వల్లభనేని వంశీని ఓడించేందుకు గద్దె అయితే సరైన అభ్యర్థిగా అధిష్ఠానం భావిస్తోందని అంటున్నారు. గద్దె రామ్మోహన్ కాకుండా విజయవాడ తూర్పు నియోజవర్గానికి టీడీపీ మరో అభ్యర్థిని పెడితే పరిణామాలు మారతాయని రాజకీయ వర్గాల టాక్. ఇప్పటికే అవినాష్ నియోజకవర్గంలో తిరుగుతుండటం, అధికార పార్టీలో ఉండటం, ఆయా సామాజిక వర్గాలను ఎట్రాక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర సామాజిక వర్గాల ఓటర్లను తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థి మారితే వైసీపీకి తిరుగుండదని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.